Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 41.3 అడుగులు దాటి ప్రవహిస్తోంది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. కుండపోత వర్షానికి రామాలయం పరిసరాల్లోకి వర్షపు నీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరో వైపు అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గోదావరి నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక.. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్‌తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నందున ఏ ఒక్క ప్రాణానికి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని, పశువులను కూడా మేతకు తీసుకెళ్లొద్దని సూచించారు.