కవాడిగూడ, మార్చి 15: ‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లను ఈ పథకం కింద నిధులు కేటాయించాలి. లేదంటే అసెంబ్లీ ముట్టడి చేపడుతాం’ అని అఖిలపక్ష నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని సర్కార్ చూస్తే.. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని, రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మారస్తామని తేల్చిచెప్పారు. ఫీజు బకాయిల సాధన కోసం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద విద్యార్థులు ఫీజు పోరు దీక్ష చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్ సమన్వయంతో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షను బహుజన తత్వవేత్త వీజీఆర్ నారగోని ప్రారంభించారు.
దీక్షలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ నేత జీ నరసింహ, టీజేఎస్ నాయకులు నిర్జన రమేశ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్, సినీ దర్శకుడు ఎన్ శంకర్ పాల్గొని మద్దతు తెలిపారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వచ్చే బడ్జెట్లో సరిపోను నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులను ఇస్తామన్న హామీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని కోరారు. పేద విద్యార్థుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కనీసం కనికరమే లేదని మండిపడ్డారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి సిద్ధంగా ఉన్నారని, ఫీజు బకాయిలు విడుదల చేసేంత వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయకుండా కాంగ్రెస్ దొంగనాటకాలు అడుతున్నదని ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఎల్ రమణ, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. బీసీ విద్యార్థుల ఫీజుల కోసం బడ్జెట్లో నిధులను విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశా రు. విద్యార్థులను నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఫీజు రీయంబర్స్మెంట్ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఫీజు బకాయిల విడుదలలో ప్రభుత్వం ఏమ్రాతం నిర్లక్ష్యం చేసినా బీసీ సంఘాలు చేపట్టబోయే అసెంబ్లీ ముట్టడిలో తాము ముందు వరుసలో ఉంటామని స్పష్టంచేశారు.
విద్యార్థుల శక్తిని రేవంత్‌రెడ్డి సర్కార్ తక్కువగా అంచనా వేయొద్దని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. విద్యార్థుల ఫీజు బకాయి నిధుల కోసం విద్యార్థుల చేస్తున్న ఉద్యమం న్యాయమైనదని, వారికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందని ఈటల హెచ్చరించారు. పేద విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. ఫీజులు రాకపోవడంతో చదువులు కొనసాగించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం మానవత్వం లేని ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జకృష్ణ, బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, నాయకులు కనకాల శ్యాంకుర్మ, మనిమంజరి సాగర్, జాజుల లింగంగౌడ్, దీటి మల్లయ్య, ప్రజాపతి, దేశగౌని సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.