Nagarjuna Sagar | నందికొండ, జులై 12 : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం రిజర్వాయర్ నుండి గత 15 రోజులుగా కొనసాగుతున్న వరద నీటితో నాగార్జుసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 550.80 (211.5434 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ఇంకా 40 అడుగుల మేర నీరు చేరవలసి ఉంది. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వరద ఉదృతి పెరిగితే, నాగార్జునసాగర్ డ్యాం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే లోపే నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు చేపడుతారు. రోజుకు రిజర్వాయర్‌లో 5 అడుగుల మేర నీరు వచ్చి చేరుతుంది. ఇదే విధంగా కొనసాగితే రానున్న వారం రోజులలో నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాల్వ, డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం క్రస్ట్, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 62983 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుండి ఎస్ఎల్బీసి ద్వారా 1650 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుంది. ఎడమకాల్వ, కుడికాల్వ, జలవిద్యుత్ కేంద్రాల నీటి విడుదల లేదు. శ్రీశైలంకు 111070 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, డ్యాం 1 క్రస్ట్ గేట్ల ద్వారా 27295 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.