Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. రెవెన్యూ రాబడుల్లో భాగంగా రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల్లో వాటా పరిమాణం అంతకంతకూ తగ్గుతుండటమే దీనికి నిదర్శనం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ మొత్తం రెవెన్యూ రాబడుల పరిమాణం రూ.51,041 కోట్లుగా నమోదైంది. ఇందులో పన్నుల్లో వాటా, గ్రాంట్లు తదితరాలు కలుపుకొని కేంద్రం నుంచి తెలంగాణకు 29.98% మేర (రూ.15,306 కోట్లు) నిధులు సమకూరాయి. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పురోగతి సాధించడంతో 2022-23 నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడుల మొత్తం రూ.1,59,350 కోట్లకు చేరింది.
ఇందులో కేంద్రం నుంచి వచ్చిన నిధుల వాటా 20.61% (రూ.32,847 కోట్లు) మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తొమ్మిదేండ్లలో ఒకవైపు తెలంగాణ స్వశక్తితో ఆదాయవృద్ధిని నమోదుచేస్తుంటే, కేంద్రం నుంచి రాష్ర్టానికి న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మాత్రం అంతకంతకూ తగ్గిపోతున్నది. తొమ్మిదేండ్ల వ్యవధిలోనే 31.25% మేర నిధులకు కేంద్రం కోత విధించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.41,259 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందుతుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థికశాఖ చివరికి రూ.4,532 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 11% మాత్రమే. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటాలు ఇవ్వక రాష్ర్టాన్ని ఇబ్బంది పెడుతున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గ్రాంట్ల విషయంలోనూ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ రాష్ర్టాలకు నిధుల వరద
గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం.. బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం బడ్జెట్ పద్దుతో సంబంధం లేకుండా గ్రాంట్ విడుదల చేస్తున్నది. ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు నవంబర్ నాటికే అంచనాల్లో 102% గ్రాంట్ ఇచ్చింది. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాకు 59.57%, త్రిపురకు 45.12%, మధ్యప్రదేశ్‌కు 44.10%, ఉత్తరాఖండ్‌కు 39.23%, ఛత్తీస్‌గఢ్‌కు 33.46%, రాజస్థాన్‌కు 28.74%, ఉత్తరప్రదేశ్‌కు 26.06%, మహారాష్ట్రకు 19.59% గ్రాంట్‌ను విడుదల చేసింది. తెలంగాణకు మాత్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను 11%తో సరిపెట్టింది. కేంద్ర పన్ను రాబడిలోనూ తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కడంలేదు. ఎన్డీయేపాలిత బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం.. ఆ రాష్ర్టానికి రూ.7.26 తిరిగి చెల్లిస్తున్నది. ఇదే సమయంలో అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు కేవలం 0.47 పైసలనే విదిలిస్తున్నది.