శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 12:19:02

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వ‌ర‌ద బాధితుల ఆగ్ర‌హం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వ‌ర‌ద బాధితుల ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వ‌ర‌ద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర‌దల్లో నష్ట‌పోయిన త‌మ‌కు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేసి ఆదుకుంటుంటే బీజేపీ నాయ‌కులు అడ్డుకుంటున్నారంటూ వ‌ర‌ద ముంపు బాధితులు కోపోద్రిక్తుల‌య్యారు. గ‌న్‌ఫౌండ్రీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ‌ను వ‌ర‌ద బాధితులు ద‌గ్ధం చేశారు. వ‌ర‌ద‌ల్లో స‌ర్వం కోల్పోయిన త‌మ‌ను ఆదుకోవ‌డాన్ని చూసి ఓర్వ‌లేకే మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ త‌మ‌కు ఆర్థిక సాయం పంపిణీ చేసేందుకు వ‌స్తే బీజేపీ వాళ్లు అడ్డుకుని త‌మ పొట్ట కొడుతున్నార‌ని బాధిత కుటుంబాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. బీజేపీ వాళ్లు సాయం చేయ‌రు.. సాయం చేసేవాళ్ల‌ని చేయ‌నివ్వ‌రు అని బాధితులు ధ్వ‌జ‌మెత్తారు. 

న‌గ‌రంలోని వ‌ర‌ద ముంపు బాధితుల‌కు త‌క్ష‌ణ సాయం కింద.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ. 550 కోట్లు విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. త‌క్ష‌ణ సాయం కింద రూ. 10 వేల చొప్పున వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం పంపిణీ చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పాల్గొని.. వ‌ర‌ద బాధితుల‌కు ఆర్థిక సాయం అంద‌జేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మందికి ఆర్థిక సాయం అందింది. మ‌రోవైపు సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపార‌వేత్త‌లు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి విరాళాలు అందిస్తున్నారు. ఈ విరాళాల‌ను వ‌ర‌ద బాధితుల స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం వినియోగిస్తోంది.