హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): జంటనగరాల పరిధిలో మూసీకి ఆకస్మికంగా వరదలు (Musi Floods) రావడం.. గతంలో ఎన్నడూలేని విధంగా ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌తోపాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకోవడం వెనుక ఏదైనా కుట్రకోణం దిగా ఉన్నదా అని పరిశీలకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం మూసీ పరివాహకంలో వందల ఇండ్లను కూల్చివేసింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో కూల్చివేతల క్రతువును పక్కన పెట్టింది. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలను అడ్డం పెట్టుకొని.. ఓ పథకం ప్రకారం జలవిలయం సృష్టించి.. గతంలో నిలిపివేసిన పేదలను తరిమివేసే ప్రక్రియకు మళ్లీ తెరలేపారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఈ బండారాన్ని బట్టబయలు చేయడంతో సర్వత్రా ఈ అంశం అందరినీ ఆలోచింపజేస్తున్నది. ముఖ్యంగా ఇప్పటికీ గుర్తుకొచ్చే 2002, 2020 కుండపోతల సమయంలోనూ మూసీ పరివాహకంలో కనిపించని ఈ విలయం ఇప్పుడు ఒక్కసారిగా ముంచెత్తడం.. నిరుపేదలను అక్కడి నుంచి శాశ్వతంగా తరలించేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే మూసీ-ఈసా నదుల అత్యధిక పరివాహక ప్రాంతాలున్న వికారాబాద్ జిల్లాలో ఈ నెలలో సాధారణం కంటే ఐదు శాతం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ.. ఈ స్థాయిలో వరదలు రావడం గమనార్హం. పరివాహక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే జంట జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేసి ఒక్కసారిగా గేట్లు ఎత్తారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా వ్యతిరేకతతో ఆగిన కూల్చివేతలు
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో నది పరీవాహకంలో ప్రపంచ ప్రఖ్యాత నమూనాల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. మూసీకి రెండువైపులా కిలోమీటరు మేర ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చివేసి 55 కిలోమీటర్ల పొడవున నైట్బజార్లతో రంగు రంగుల ప్రపంచాన్ని సృష్టిస్తామని తెలిపింది. ఇందుకోసం పరివాహకంలో దశాబ్దాలుగా ఉంటున్న నిరుపేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపిం కుప్పకూల్చింది. ఒక నది ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మాణాలు ఎలా ఉంటాయో నిబంధనలను వల్లెవేసింది.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు కాకముందే కేవలం ప్రభుత్వ పెద్దల ప్రకటనల్లోనే రూ.50వేల కోట్ల నుంచి రూ.75 వేల కోట్లు ఆ పై లక్షన్నర కోట్లకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం ఎగబాకింది. చివరకు కన్సెల్టెన్సీ నియామకంలోనూ భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మూసీ కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ వేసిన ప్రభుత్వం అదును చూసి దానిని పునరుద్ధరించేందుకు చాపకింద నీరులా చర్యల్ని ముమ్మరం చేస్తూనే ఉంది. తరచూ సీఎం సహా పలువురు మంత్రులు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టి తీరుతామంటూ ప్రకటిస్తూనే ఉన్నారు.
నిరుపేదల్ని బెంబేలెత్తిస్తున్న జలదిగ్బంధం..
మురికికూపంలా మారిన మూసీని ప్రక్షాళన చేయాలనేది ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. వాటికి కొనసాగింపుగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జలాల్ని మూసీకి తరలించే ప్రాజెక్టుకు ఇటీవలనే శంకుస్థాపన చేశారు. కాకపోతే పరివాహకంలో దశాబ్దాలుగా జీవిస్తున్న నిరుపేదల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తంకావడంతో వారి ఇండ్ల కూల్చివేతను తాత్కాలికంగా వాయిదా వేశారు అయితే ఎప్పుడు వాటిని పునరుద్ధరిస్తామనే కుట్రలో భాగంగానే జంట జలాశయాల నుంచి ఒక్కసారిగా వరదను మూసీలోకి వదిలినట్టు సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ బండారాన్ని బయటపెట్టడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ మొదలైంది.
2020లో 32 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిన సమయంలో నగరంలో ఇలాంటి అవస్థలు చూడలేదని, ఉద్దేశపూర్వకంగానే జంట జలాశయాల నుంచి 25-30వేల క్యూసెక్కుల జలఖడ్గాన్ని నిరుపేదల బస్తీ మీదకు వదిలారని అందరూ మండిపడుతున్నారు. ఇదే సమయంలో హైడ్రా, ఇతర అధికార యంత్రాంగం సహాయక చర్యల పేరిట డ్రోన్లతో మూసీ విలయాన్ని చిత్రీకరించి.. తదుపరి ఈ స్థాయిలో వరద ఉన్నందున కచ్చితంగా ఖాళీ చేయాలనే ప్రతిపాదనను త్వరలో ముందుకు తీసుకురానున్నారని చెప్తున్నారు. ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ జలదిగ్బంధనం కావడాన్ని అత్యధిక మంది ప్రస్తావిస్తున్నారు. దాని చరిత్రలోనే ఇలాంటి దృశ్యాలు చూడలేదని, ఇటీవలి కంటే రెట్టింపు వర్షాలు పడినప్పుడు కూడా ఎంజీబీఎస్‌లోని బస్స్టాండ్ల దాకా వరద వచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. అంటే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ విలయాన్ని సృష్టించిందనే కేటీఆర్ వ్యాఖ్యల్ని అందరూ సమర్థిస్తున్నారు.
మొన్న పాకిస్థాన్ తన పౌరులపైనే బాంబులు వేస్తే పిచ్చోళ్లని నవ్వుకున్నం. కొరియాలో నియంత తన పౌరులను తానే చంపేస్తుంటే మూర్ఖుడని చెప్పుకొన్నం. ఎందుకంటే ఏ పాలకుడు కూడా తన పౌరులను తానే చంపుకోడు.
కానీ ఇవాళ చరిత్రలో తొలిసారి ఒక ప్రభుత్వం తన రాజధానిని తానే వరదపాలు చేయడం చూస్తున్నం. ఒక కుక్కను చంపాలంటే పిచ్చిపట్టిందనే పేరు పెట్టినట్టు.. మూసీ పునరుజ్జీవ పథకం అమలుకు బలమైన సాకుకోసం సర్కార్ ఒక్కసారిగా జంటజలాశయాల నీటిని వదిలేసి హైదరాబాద్‌ను వరదలతో ముంచెత్తించింది. ఇటీవలి కాలంలో పెద్దగా వరదల మాటే ఎరుగని మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూడా వరదలు ముంచెత్తితే రాత్రికి రాత్రి ఆ ప్రాంతాల ప్రజలంతా బతుకుజీవుడా అంటూ తట్టాబుట్టా సర్దుకుని పరుగులు తీయాల్సివచ్చింది. నీడనిచ్చే గూడు వదిలి దిక్కులేని పక్షులు కావలిసి వచ్చింది.
ఇంత వరద బీభత్సానికి కారణం ఏమిటి?
ఇపుడేమైనా చరిత్ర ఎరుగనంత వర్షం ఏమన్నా నగరంలో కురిసిందా? లేదు!. పైన ఏ రిజర్వాయర్కైనా గండిపడిందా? లేదు! మరి మూసీలో ఎన్నడూ చూడనంత వరద ఎక్కడినుంచి వచ్చింది? దశాబ్దాలుగా ఇంతకన్నా పెద్ద వానలు రాలేదా? అప్పుడున్న ప్రభుత్వాలు నీటిని ఒక క్రమ పద్ధతిలో విడుదల చేసి ముంపు తలెత్తకుండా పరిస్థితి నియంత్రించలేదా? నియంత్రించాయి. మరి ఇప్పుడే ఇలా ఎందుకు జరిగింది? చరిత్రలో ఏనాడూ లేనట్టు మొదటిసారి ఎంజీబీ బస్ స్టేషన్‌ను ఎందుకు వరద ముంచెత్తింది? 30 ఏండ్ల క్రితం ఎన్టీఆర్ హయాంలో వందల ఏండ్ల వరదలు, నీటి మట్టాల లెక్కలు వేసి ఏ వరదకూ అందనంత ఎత్తులో కట్టిన ఆ బస్‌స్టేషన్ ఎందుకు జలమయమైంది? తెలంగాణ ప్రజలకు ప్రీతిపాత్రమైన దసరా పండుగకు ఊళ్లకు వెళ్లేందుకు తండోపతండాలుగా వేచి ఉన్న ప్రయాణికులు ప్రాణాలు అరచేత్తో పట్టుకొని బయటపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
ఒకటే జవాబు! ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా జంట జలాశయాల్లో నీరు నింపి మొత్తం నీటిని ఒక్కసారిగా వదిలేయడం.
అందువల్లే హైదరాబాద్ నీట మునిగింది. ఎంజీబీఎస్ వరదల పాలైంది. మూసీ తీరంలో ఎన్నడూ జలమయం కాని ప్రాంతాల్లో నీళ్లు వెల్లువెత్తాయి. ఇందుకు కారణం ఒక్కటే..!
అది మూసీ పునరుజ్జీవ పథకం!మూసీ తీరం వెంట ప్రజలు నయానో భయానో ఖాళీ చేయడం లేదు. వారిని వరదలతో భీతావహులను చేసి తరిమేస్తే భూసేకరణ అవసరం లేదు. చర్చలు అవసరం లేదు. పరిహారం ఇవ్వక్కర్లేదు. లక్షల కోట్ల విలువైన భూములు చేతికొస్తాయి. ఇంతకాలం చెరువుల దగ్గర పేదల ఇండ్లను హైడ్రా కూలిస్తే నేడు ప్రభుత్వం మూసీ తీరంలోని పేదల ఇండ్ల మీద పడుతున్నది.
కాంగ్రెస్ ఒకనాటి నినాదమైన ‘గరీబీ హఠావో’ను..‘గరీబోంకో హఠావో’గా మార్చి ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నది!!