హైదరాబాద్ సిటీబ్యూరో/రామంతాపూర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకున్నది. కరెంట్ షాక్‌తో ఐదుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యుత్తు శాఖ ఎండీని నిలదీశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రథంపై శ్రీకృష్ణుడి ఉరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఆదివారం రాత్రి స్థానిక వీధుల్లో యాదవ సంఘం భవనం నుంచి శ్రీకృష్ణుడి ఉరేగింపు చేపట్టారు. ఓవైపు వర్షం పడుతుండగా మరోవైపు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి రథయాత్ర కొనసాగింది. ఉరేగింపు దాదాపు పూర్తయి తిరిగి రథాన్ని యాదవ సంఘ భవనం వద్ద పెట్టేందుకు వెళ్తుండగా రథాన్ని ముందుకు లాగుతున్న జీపు ఆగిపోయింది. మరో వంద అడుగుల దూరం ఉండటంతో చేతులతో తోస్తూ వెళ్లారు. మరో 50 అడుగుల దూరం ఉండగానే ఆకస్మాత్తుగా రథాన్ని లాగుతున్న వాళ్లు గట్టిగా అరుస్తూ కిందపడిపోయారు. అప్పటికే రథంపై ఉన్న వాళ్లు ఏం జరిగిందో అర్థం కాక పరుగులు పెట్టారు. వేలాడుతున్న విద్యుత్తు తీగ రథానికి తగిలి షాక్ కొట్టింది. దీంతో వెనుక నుంచి తోస్తున్న వాళ్లు 9 మంది అపస్మార స్థితిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు కొందరికి సీపీఆర్ కూడా చేసినా ఫలితం లేకుండాపోయింది. ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురిని చికిత్స కోసం వివిధ దవాఖానాలకు తరలించారు.
రథానికి పైన ఉన్న కేబుల్ వైర్లు తగిలి కరెంటు షాక్ కొట్టినట్టు అధికారులు చెప్తున్నారు. రథాన్ని బయట నుంచి తోస్తున్న వారు విద్యుదాఘాతానికి గురయ్యారు. విద్యుత్తు లైన్లపై నుంచి కేబుల్ వైర్లు వెళ్లడంతో అవి కాలిపోయి కాపర్ తేలింది. ఘటనలో ఓల్డ్ రామంతాపూర్‌కు చెందిన కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్(21), సురేశ్‌యాదవ్ (34), హబ్సీగూడకు చెందిన రుద్రవికాస్ (39), రామంతాపూర్ శారదానగర్‌కు చెందిన శ్రీకాంత్ రెడ్డి (35), హబ్సీగూడ రవీంద్రనాథ్ కాలనీకి చెందిన రాజేందర్‌రెడ్డి (48) అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిలో గోల్నాకకు చెందిన గణేశ్(21) ఉస్మానియా, ఓల్డ్ రామంతాపూర్‌కు చెందిన రవీంద్రయాదవ్ అపోలో, ఎల్బీనగర్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాగోల్‌లోని సుప్రజ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు మండిపడ్డారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యమే ఘటనకు కారణమంటూ ఆందోళన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గాంధీ దవాఖాన వద్ద మృతుల కుటుంబాలను మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.
మృతుల కుటుంబాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్ పరామర్శించారు. ఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్ రామంతాపూర్ గోఖలేనగర్ దుర్ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కృష్ణాష్టమి వేడుకల్లో ఐదుగురు యువకులు కరెంట్ షాక్‌కు బలికావడం దురదృష్టకరమని వాపోయారు. సోమవారం ఎక్స్ వేదికగా మృతులకు నివాళులర్పిస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు పరిహారమిచ్చి ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సర్కారును కోరారు.