హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/బాలానగర్: ఆపదలో ఉన్న వారు ‘అన్నా..’ అంటే ‘నేనున్నా..’ అంటూ అండగా నిలిచే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. గత డిసెంబర్ 5న జీడిమెట్లలో న్యూస్ కవరేజీకి వెళ్లి, గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి అండగా నిలిచారు. వారికి వ్యక్తిగతంగా రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేసి భరోసానిచ్చారు. ఆయన తరఫున కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు శుక్రవారం దామోదర్ ఇంటికి వెళ్లి నగదును అందజేశారు. దామోదర్ గుండెపోటుకు గురైన రోజున కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దవాఖానకు వెళ్లారు. ఆయన చికిత్సను దగ్గురుండి పర్యవేక్షించినప్పటికీ ఫలితం దక్కలేదు. దురదృష్టవశాత్తు దామోదర్ ప్రాణాలు కోల్పోయారు.
విషయం తెలుసుకున్న కేటీఆర్ హుటాహుటిన స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు తాజాగా రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. దామోదర్ మృతి చెందిన సమయంలో అంత్యక్రియల నిమిత్తం రూ.ఒక లక్ష సాయం అందజేసినట్టు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్‌లో కూడా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు మందడి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.