ఖమ్మం, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భూ తగాదాలు రైతుల బలి కోరుతున్నాయి. గోడు వినే నాథుడు లేక.. కష్టాలు తీర్చే నాయకుడు కనిపించక దిక్కుతోచనిస్థితిలో క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబసభ్యులను రోడ్డునపడేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఖమ్మం జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వీరిలో దురదృష్టవశాత్తు ఇద్దరు రైతులు మృతిచెందగా.. మిగిలిన ముగ్గురు రైతులు చికిత్స తర్వాత కోలుకున్నారు.
జూలై 1 తేదీన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన బోజెడ్ల భద్రయ్య సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకులు తన భూమిని చెరువు శిఖంలో కలిపివేశారని, సరిహద్దులు దున్నేశారని వీడియోలో ఆరోపించారు.
జూలై 4న కారేపల్లి మండలం ఆలియాతండాకు చెందిన రైతు పచ్చిపాల భద్రయ్య తన భూమిని ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్‌నాయక్ కబ్జా చేశారని పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స తర్వాత కోలుకున్నాడు.
జూలై 8న ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన మేడి సీతయ్య తన భూమిలో పని చేసేందుకు వెళ్లగా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స తర్వాత కోలుకున్నాడు.
జూలై 9న రఘునాథపల్లి మండలం రజబ్అలీనగర్కు చెందిన రైతు ప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందిన అనంతరం క్షేమంగా ఉన్నాడు. పోడు సాగు చేసుకుంటున్న సుమారు ఆరున్నర ఎకరాల భూమిని కానిస్టేబుల్ లక్ష్మణ్ తన కూతురు లావణ్య పేరుపై పట్టా చేసుకున్నాడని ప్రసాద్ ఆరోపణ.
ఆగస్టు 4న ఖమ్మం రూరల్ మండలం జాన్‌బాద్‌తండాకు చెందిన రైతు ఏలేటి వెంకటరెడ్డి (46) తన భూమిని జాటోత్ వీరన్న ట్రాక్టర్‌తో దున్నుతున్నాడని మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చిక్సిత పొందుతూ బుధవారం మృతి చెందాడు.2021లో ఇదే భూ వివాదంలో వెంకటరెడ్డి సోదరుడు భూపాల్‌రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నాతమ్ముళ్లు భూ తగాదాలతో మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదం నెలకొన్నది.
జిల్లా, మండల కేంద్రాల్లో గ్రీవెన్స్(ప్రజావాణి)తోపాటు పోలీస్ కమిషనరేట్‌లోనూ అత్యధికంగా రైతు సమస్యలపైనే అర్జీలు అందుతున్నాయి.జిల్లా నుంచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు మరో నలుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అయినా జిల్లా రైతులు అభద్రతకు గురికావడం బాధ కలిగించే అంశం. ఒకవైపు రైతులను భూ తగాదాలు చుట్టుముడుతుండగా..మరోవైపు రుణమాఫీ కోసం వందలాది రైతులు నిత్యం సొసైటీలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రులు జిల్లాలో రైతులకు అవసరమైన భరోసా కల్పించి.. రైతుల ప్రాణాలను కాపాడడంతోపాటు వారి సమస్యలకు చెక్ పెట్టాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ఒక నెలలోనే ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఇద్దరు మరణించడం తీవ్రమైన విషయం. ముగ్గురు మంత్రులున్న జిల్లాలోనే రైతులకు ఈ దుస్థితి ఉంది. ఇది ఏమాత్రం క్షమార్హం కాదు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మాటలకు పరిమితమైంది. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి. రైతులు అధైర్యపడవద్దు. సమస్యలుంటే పోరాడి పరిషరించుకుందాం. సమస్యకు చావు పరిషార మార్గం కాదు.