హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఐదు పెండింగ్ డీఏలు అడ్రస్లేవు.. పీఆర్సీ పత్తాలేదు. పెండింగ్ బిల్లులు మంజూరుకావు. రిటైరైన ఉద్యోగులకు ప్రయోజనాలు అందవు. జీపీఎఫ్‌లో దాచుకున్న డబ్బులు కూడా తీసుకోలేని దైన్యం. అనారోగ్యం బారినపడితే ఆదుకునేందుకు హెల్త్‌స్కీం లేదు. ఇదీ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఇలాంటి 59 డిమాండ్లు 200కు పైగా సమస్యలు పేరుకుపోయాయి. వీటిపై వందల సార్లు వినితిపత్రాలిచ్చినా.. ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. వీటిపై ఉద్యోగులు ఉద్యమ బాట పట్టగానే చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం ఆ తరువాత ఒక డీఏ మాత్రం విడుదల చేస్తామని హామీ ఇచ్చి మిగిలినవి పక్కన పెట్టేస్తున్నది. తాజాగా ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించగానే.. ఉద్యోగుల జేఏసీ నేతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలకు ఆహ్వానించారు.
ఇంతకుముందు చర్చల సందర్భంగా ఉద్యోగుల జేఏసీ మొత్తం 57డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటిలో 45 ఆర్థికేతర, స్వల్ప ఆర్థికభారమైనవి కాగా, కేవలం 12మాత్రమే పూర్తిగా ఆర్థికభారం గలవి ఉన్నాయి. వీటిలో ముందు ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తాం.. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. పెండింగ్ బిల్లులను ఒకేసారి ఇవ్వలేం. నెలకు రూ.700కోట్లు ఇస్తామన్నది. డీఏలను ఒకేసారి ఇవ్వలేం.. ఇప్పుడు ఒకటిస్తాం.. ఆరు నెలల్లో రెండో డీఏనిస్తామని చెప్పింది. కానీ చివరికి ప్లేటు ఫిరాయించింది. ‘రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగస్తులకు అప్పగిస్త. పైసాపైసా మొత్తం లెక్క మీకే అప్పజెప్త. ఒక్క పైసా కూడా నా దగ్గర పెట్టుకోకుండా మొత్తం పైసల్ ప్రభుత్వ ఉద్యోగులకు అప్పజెప్త. ఆఖరికి నా నెలజీతం కూడా మీకే ఇస్తా.. ఏది ఎట్ల పం చాలో మీరే చెప్పండి. ఈనెల జీతాలివ్వలేని పరిస్థితి ఉంటే రిజర్వ్ బ్యాంక్‌లో తలకాయ తాకట్టుపెట్టి రూ.4వేల కోట్లు తెచ్చి జీతభత్యాలిచ్చాం. మీరేమో డీఏలు, కరువుభత్యాలు అ డుగుతున్నరు. నన్ను కోసుకుతిన్నా రూపాయి లేదు ఎవరిపై మీరు సమరం జేస్తరు. ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తరు?’ అంటూ ఏకంగా రేవంత్‌రెడ్డి ఉద్యోగులను దబాయించారు.
n రాష్ట్రంలోని 200కు పైగా సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. 50కి పైగా డిమాండ్లు, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇది తమ కొంప ముంచుతుందని భావించిన సర్కారు 2024 మార్చి 10న ఎంసీహెచ్చాఆర్డీలో ఉద్యోగ సంఘాల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ సహా మంత్రులు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ఏకరవుపెట్టాయి. ఈ సమావేశం తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఐఏఎస్ అధికారి దివ్యాదేవరాజన్తో కమిటీ ఏర్పాటుచేశారు. జేఏసీ నేతలు సమావేశమై చర్చలు జరిపారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు.
n ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ 2024 అక్టోబర్ 22న ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. దీంతో జడుసుకున్న సర్కారు జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. 2024 అక్టోబర్ 24న సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చలు జరిపారు. డిసెంబర్‌లోపు ఆర్థికేతర డిమాండ్లు, ఏప్రిల్‌లోపు ఆర్థికపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ప్ర భుత్వం గతంలో హామీనిచ్చింది. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా మంత్రులు డీ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా, జీడీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జేఏసీతో చర్చించింది లేదు. ఒక్క సమస్యనూ పరిష్కరించింది లేదు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించింది. మే 15న నల్లబ్యాడ్జీలతో నిరసన, జూన్ 9న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఐఏఎస్ అధికారి నవీన్‌మిట్టల్ చైర్మన్‌గా, కృష్ణభాస్కర్, లోకేశ్‌కుమార్ సభ్యులుగా కమిటీ వేసింది. వారం రోజుల్లో నివేదికను అందజేయాలని సర్కారు ఆదేశించగా, ఈ కమిటీ నివేదికనిచ్చింది. ఒక డీఏ విడుదల చేసి, రెండో డీఏ ఆరు నెలల్లో ఇస్తామన్నారు. నెలకు 700 కోట్ల పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని, అడపాదడపా బిల్లులు మంజూరుచేయడం మినహా అన్ని సమస్యలు పెండింగ్‌లోనే ఉంచారు.
క్యాబినెట్ సమావేశం, అధికారుల కమిటీ నివేదిక తర్వాత ఒక డీఏ తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఆగస్టు 15లోపు తమ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ అల్టిమేటం జారీచేసింది. లేనిపక్షంలో కార్యాచరణను ప్రకటిస్తామన్నది. ఈ హెచ్చరికలను సర్కారు ఖాతరు చేయలేదు. కసీసం చర్చలకు కూడా ఆహ్వానించలేదు. దీంతో ఉద్యోగుల జేఏసీ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 19 వరకు జిల్లాల్లో బస్సుయాత్రను తలపెట్టింది. తర్వాత అక్టోబర్ 12న చలో హైదరాబాద్‌లో రెండు లక్షల మందితో మార్చ్‌ను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం జేఏసీ నేతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలకు ఆహ్వానించారు.
సర్కారు ఉదాసీనత, అలసత్వంతో రాష్ట్రంలోని 13.31 లక్షల కుటుంబాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. స ర్కారు తీరుతో విసిగి వేసారిపోయిన ఉద్యోగుల జేఏసీ.. ఉద్యమిస్తాం.. సమరంజేస్తామన్న ప్రతిసారి సర్కారు చర్చల పేరు చెప్పి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నది. తాజాగా మంగళవారం చర్చలు జరగనున్న నేపథ్యంలో మరోసారి మోసం పునరావృతమవుతుందేమోనని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ప్రతిసారి మోసం చేస్తున్న సర్కారు వైఖరి పట్ల జేఏసీ నాయకత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని.. ప్రభుత్వ మాటలను నమ్మి ఉద్యోగులను నట్టేట ముంచవద్దని సాధారణ ఉద్యోగులు కోరుతున్నారు.