దుబ్బాక, డిసెంబర్ 4 : ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు, ఇద్దరు కుల పెద్దలు, మరో 56 మందిపైనా పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లిలో గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ ఆలయ ఆవరణలో గురువారం ఉదయం ముదిరాజ్ కులస్థులు సమావేశమయ్యారు.
సర్పంచ్ స్థానం బీసీకి రిజర్వు కావడంతో ముదిరాజ్ కులానికి చెందిన ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓట్లు వేయాలని కులస్థులు తీర్మానం చేస్తున్నట్టు సమాచారం రావడంతో భూంపల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం, డబ్బుల కోసం ఓట్లు వేసే అంశాన్ని చర్చించినందుకు ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులతోపాటు ఇద్దరు కుల పెద్దలు, మరో 56 మందిపై భూంపల్లి ఎస్సై హరీశ్ కేసు నమోదుచేశారు.
పరిగి, డిసెంబర్ 4 : పంచాయతీ ఎన్నికల విధులకు సంబంధించి శిక్షణ సమయంలోనే ఒక్కో ఉద్యోగికి నాలుగు రకాల ఆదేశాలు జారీ చేసిన అధికారులు తాజాగా చనిపోయిన, రిటైర్ అయిన ఉద్యోగులకు ఎన్నికల విధులకు రావాలని లేఖలు పంపారు. ఈ విచిత్ర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పరిగి మండలం రాపోల్ గ్రామంలోని అంగన్వాడీ-2 కేంద్రం అంగన్వాడీ టీచర్ డీ భాగ్యరేఖ 2020 సంవత్సరంలో మృతి చెందింది.
కాగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓపీవో (అదర్ పోలింగ్ ఆఫీసర్)గా నియమిస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. మరోవైపు పరిగిలోని ఎంపీపీఎస్ పరిగి (బాలికలు) ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వడ్ల కనకాచారితోపాటు మరికొందరికి సైతం ఎన్నికల విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఉన్నతాధికారుల అనాలోచిత చర్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.