శనివారం 06 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:26:49

కొనసాగుతున్న అల్పపీడనం

కొనసాగుతున్న అల్పపీడనం

  • ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల ఉరుముల వాన
  • ఆసిఫాబాద్‌ జిల్లాలో గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ద్రోణి
  • ఆసిఫాబాద్‌ జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈశాన్య మరాఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్‌ కర్ణాటక మీదు గా సముద్రమట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. ఆది, సోమవారాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంలో చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. మరోవైపు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అత్యధికంగా శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదైంది.


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఐదు రోజుల వర్షసూచన

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల ఐదు రోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పగలు ఎండలు, సాయంత్రం వర్షాలు కురుస్తాయని చెప్పారు. 

రేపు వాయుగుండం

దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనంతోపాటు దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. అల్పపీడనం బలపడి సోమవారం అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నది. ఇది ఈ నెల 6 వరకు ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించొచ్చు.


logo