గుర్రంపోడ్/ నల్లగొండ సిటీ, ఏప్రిల్ 21 : ‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దోచుకునేది. అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీస్తుంది. జిల్లాలో పనికిరాని మంత్రులు ఉన్నరు. మేము పొడుగున్నామని చెప్పుకోవడానికి తప్పితే రైతులకు ఉపయోగపడని దద్దమ్మలు వారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి ఆదివారం గుర్రంపోడ్, కనగల్ మండల కేంద్రాల్లో రోడ్ షో, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కేంద్రాల్లోని వడ్ల రాశులు అకాల వర్షాలకు తడిసి మట్టి పాలవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు.
జిల్లా మంత్రులు మిల్లర్లు, క్రషర్ మిల్లుల యజమానులను, కాంట్రాక్టర్లను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు కళకళలాడేవని, ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి వెలవెలబోతున్నాయని అన్నారు. ఇది పంటలకు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని విమర్శించారు. 2014లో రూ.200 ఉన్న పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తామని తాము హామీ ఇచ్చామన్నారు. అధికారంలోకి రాగానే ఆ హామీని నెరవేర్చామని చెప్పారు. రెండోసారి అధికారంలోకి రాగానే ఆ పింఛన్‌ను రూ.2వేలు చేశామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, కేసీఆర్ కిట్, రైతు బీమా ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేశామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తూ చెప్పని అనేక పథకాలను అమలు చేశామని చెప్పారు. 420 దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 120 రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, కనగల్ ఎంపీపీ కరీంపాషా, గుర్రంపోడ్ వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ్, పార్టీ రాష్ట్ర నాయకులు సత్తయ్యగౌడ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, యాదయ్యగౌడ్, మర్రి రేణుక పాల్గొన్నారు.
ఇది రైతు బిడ్డకు, రాజకీయ నాయకుడి బిడ్డకు మధ్య పోటీ. నన్ను గెలిపించి లోక్‌సభకు పంపితే రైతుల పక్షాన కొట్లాడుతా. ప్రతి మండలంలో కార్పొరేట్ విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తా. రైతులకు మూడు పంటలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారు.
– కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ర్టాన్ని వ్యవసాయం, విద్య, విద్యుత్ రంగాల్లో, సంక్షేమంలో, సాగు, తాగునీరు సరఫరాలో మొదటి స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. రైతులకు 24 గంటల కరెంట్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే. అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగు నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలి.
420 హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఒక్కటీ నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. వృద్ధులకు రూ.4 వేల పింఛన్, నిరుద్యోగ భృతి రూ.4వేలు, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు, ధాన్యానికి బోనస్ రూ.500, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– నోముల భగత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే