ములకలపల్లి, మార్చి 23 : భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం స్టోర్ రూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. సెలవు దినం కావడంతో మొత్తం 230 మంది విద్యార్థులు వసతిగృహంలోనే ఉన్నారు. ఎస్సై రాజశేఖర్, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఉదయం స్టోర్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులను అప్రమత్తం చేసి వెంటనే బయటకు పంపామని వార్డెన్ నాగప్రత్యూష తెలిపారు.
అమరచింత, మార్చి 23 : వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్లోకి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి సుజయ్ కులకర్ణి(24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సుజయ్ కులకర్ణి(24) హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. రెండు నెలల క్రితం వివాహం జరగగా అప్పటి నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. శనివారం సాయంత్రం జూరాల వద్దకు వచ్చి అక్కడ సెల్ఫోన్, వస్తువులను ఉంచి, నీటిలో దూకాడు. స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి పోలీసులు మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు.