హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గడ్డ మీద ఒక ఆడబిడ్డ హక్కులను కాలరాసిన ఏపీ పోలీసులు.. ఆపై ఆమె మీద కక్ష సాధింపు చర్యలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు తన భర్తను బలవంతంగా తీసుకెళ్తుండగా ఎదిరించిన పాపానికి ఆమెపై బొబ్బిలిలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 30న రాత్రి కర్మన్‌ఘాట్‌లోని జర్నలిస్ట్ కొసిక వెంకట్రాంరెడ్డి (కేవీఆర్) ఇంటి వద్ద ఏపీ పోలీసులు హైడ్రామా చేసిన విషయం తెలిసిందే. కేవీఆర్‌ను బలవంతంగా తీసుకెళ్తుండగా ఆయన భార్య విజయలక్ష్మి వాళ్లను ప్రశ్నించింది.
మఫ్టీలో ఉన్న బొబ్బిలి పోలీసులు ఆమె పట్ల అనుచితంగా, దురుసుగా ప్రవర్తించారని, దీనిపై ఆమె అదేరోజు రాత్రి సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూలై ఒకటిన బొబ్బిలి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తోపాటు మరికొందరిపై సరూర్‌నగర్ పో లీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు ప్రతీకార చర్యగా.. బొబ్బిలి పోలీసులు విజయలక్ష్మిపై తమ పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేసుకొ ని, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ జీరో ఎఫ్ఐఆర్ను తెలంగాణకు బదిలీ చేసి స రూర్నగర్లో కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
కేవీఆర్ తన చానల్ లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప దం కావడంతో కర్నూల్ 4వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరైన తనను కర్నూల్ పోలీసులు రాత్రం తా ఠాణాలో నిర్బంధించి, చిత్రహింసలకు గు రిచేసినట్టు కేవీఆర్ ఆ తరువాత వెల్లడించా రు. ఆ తరువాత మహిళల మనోభావాలు దె బ్బతినే విధంగా కేవీఆర్ వ్యాఖ్యలు చేశారం టూ బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు న మోదు చేశారు. కేవీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు జూన్ 30న అక్కడి పో లీసులు, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మఫ్టీలో వచ్చారు.
మఫ్టీలో వచ్చిన ఏపీ పోలీసులపై విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆమె ఆటంకం కలిగించారని బొబ్బిలి పోలీసులు భావిస్తే.. అదేరోజు ఇక్కడే సరూర్‌నగర్ పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేయాలి. కానీ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు తమపై కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న తరువాతనే బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేశారనే వాదన వినిపిస్తున్నది. దీనిద్వారా విజయలక్ష్మిపై ఇక్కడ ఒత్తిడి పెంచేందుకు అవకాశముంటుందనే భావనలో స్థానిక పోలీసులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఒక తెలంగాణ బిడ్డపై పొరుగు రాష్ట్ర పోలీసులు దౌర్జన్యం చేస్తే.. ఇక్కడి పోలీసులు వత్తాసు పలుకుతారా అంటూ తెలంగాణ వాదులు నిప్పులు చెరుగుతున్నారు.
కేవీఆర్‌కు ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. జర్నలిస్ట్ కుటుంబానికి పరామర్శ
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఏపీ పోలీసులు తీసుకెళ్లిన జర్నలిస్ట్ కే వెంకట్రామ్‌రెడ్డికి ఏం జరిగినా ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గం బైరామల్‌గూడలో నివాసముంటున్న కేవీఆర్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయసహాయం అందజేస్తామని భరోసానిచ్చారు. కేవీఆర్ కుటుంబసభ్యులతో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట గడ్డిఅన్నారం ఏఎంసీ మాజీ చైర్మన్ డాక్టర్ రామ్నరసింహగౌడ్, చెన్నయ్య, బింగి భరత్, యాదగిరి, శ్రీకాంత్, నవీన్‌చారి, తదితరులు ఉన్నారు.