కరీంనగర్ : హోలీ పండుగ రోజున కరీంనగర్ మానేరు వాగులో ప్రమాదవశాత్తు పడి చనిపోయిన ముగ్గురు పిల్లల కుటుంబాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar)ఆర్థిక సహాయం(Financial assistance )చెక్కులను అందజేశారు. ప్రభుత్వం తరపున రూ. 3 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా, తన సొంత నిధుల నుంచి మరో రూ. 2 లక్షలు కలిపి మొత్తం 5 లక్షల పరిహారాన్ని చెల్లిస్తామని మంత్రి గంగుల ఇదివరకు ప్రకటించారు.
ఇచ్చిన హామీ మేరకు మంగళవారం నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకు కలెక్టర్ సమావేశ మందిరంలో అందజేశారు. చనిపోయిన పిల్లలను తాము తిరిగి తెచ్చి ఇవ్వలేమని,తమ వంతుగా ఆర్థిక సహాయంఅందిస్తున్నామని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
హోలీ పండుగను సంతోషంగా జరుపుకునే సమయంలో ముగ్గురు పిల్లలు మృతి చెందడం బాధాకరమని మంత్రి అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.