హుస్నాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ బీఆర్ఎస్ సర్కారు చేతల ప్రభుత్వంగా నిలిస్తే..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నిధులను అడ్డుకుంటూ కోతల సర్కారుగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్లో రూ.2 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ, కోహెడ మండల కేంద్రంలో దుకాణ సముదాయం, పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించారు.
ఆయా సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా రైతు బంధు కింద ఎక్కువ మంది రైతులకు ఆర్థిక సహాయం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు పీఎం కిసాన్ యోజన పథకం కింద లబ్ధిపొందే 1.74 లక్షల రైతుల సంఖ్యను 1.39 లక్షలకు కుదించిందని వెల్లడించారు. తెలంగాణకు వచ్చే ఎరువుల సబ్సిడీలో రూ.4 వేల కోట్ల కోతలు విధించిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ కోసం రోజుకు రూ.30 కోట్లు, నెలకు రూ.వెయ్యికోట్లు కేటాయిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరెంట్ మీటర్లు పెట్టాలని నిబంధనలు పెడుతూ సబ్సిడీల్లో కోతలు విధిస్తున్నదని పేర్కొన్నారు.
ఎరువుల ధరలు, పంట కొనుగోళ్లలో బీజేపీ సర్కారు కోతలు విధిస్తూ రైతుల నడ్డి విరుస్తుంటే..తెలంగాణలో రైతులను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని తెలిపారు. అందుకే దేశంలోని రైతులందరూ తెలంగాణలోని రైతు ప్రభుత్వంవైపే చూస్తున్నారని, ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకొచ్చిన సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. ఉగాది పండుగ తర్వాత రూ.250 కోట్లు కేటాయించి గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నట్టు చెప్పారు. పేల్చుతాం…కూల్చుతాం అనే నాయకులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులేనని, అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నాయకుల మాటలు వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని, వీరిని ప్రజలే తరిమికొట్టే పరిస్థితి త్వరలోనే వస్తుందని వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ పనులను వచ్చే 45 రోజుల్లో పూర్తి చేస్తామని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ లక్షా 6 వేల ఎకరాలకు సాగునీరు అందించే గౌరవెల్లి రిజర్వాయర్‌పై కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తూ అడ్డంకులు సృష్టించడం వారి ఓర్వలేనితనానికి నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, వైస్ చైర్పర్సన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, మార్కెట్ చైర్పర్సన్ రజినీతిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, పేర్యాల రవీందర్రావు, పన్యాల భూపతిరెడ్డి పాల్గొన్నారు.
పదో తరగతి ఫలితాల్లో నిరుడు మాదిరిగానే ఈ ఏడాదికూడా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలువాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్ పర్యటనకు తన కారులో వెళ్తుండగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, ఎంఈవోలు, డీఈవోలతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా ఫోన్‌చేశారు. పాఠశాలనుంచి ఇంటికి వచ్చాక విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకొనేలా తల్లిదండ్రులు సహకారం అందించాలని సూచించారు. పరీక్షలు పూర్తయ్యేవరకూ విద్యార్థులను టీవీ, సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలని చెప్పారు.
‘విద్యార్థులు సులువుగా అర్థం చేసేకొనేలా డిజిటల్ కంటెంట్ ఉన్న స్టడీ మెటీరియల్‌ను అందజేశాం, తల్లిదండ్రులుగా ఇంటి వద్ద వారిని చదివించాల్సిన బాధ్యత మీపైనే ఉంది’ అని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానానికి ఎదగాలనేదే తన లక్ష్యమని, అందుకే డిజిటల్ కంటెంట్, అల్పాహారం అందజేసి మరీ ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి పది మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని ఎంపిక చేశామని వివరించారు. సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లోనూ అగ్రస్థానంలో నిలువాలని ఆకాంక్షించారు. 10/10 జీపీఏ సాధించే విద్యార్థులకు రూ. పదివేల నగదు బహుమతి అందజేస్తానని ప్రకటించారు. ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సన్మానిస్తానని వెల్లడించారు.
పేరెంట్ 1..
నేను రాసిన ఉత్తరం ముట్టిందా కిషన్.. ఈ నెల రోజులు జర టీవీలు పెట్టకున్రి. లొల్లి చేయకున్రి. పిల్లలకు పనిచెప్పకున్రి. బాగా చదివిపియ్యున్రి. మీరు సీరియల్ పెట్టుకొని చూస్తుంటే ఆ ముచ్చట్లు వినబడి పిల్లగాల్ల సగం చెవులు ఇటుంటయ్. మైండ్ కరాబైతది. ఇగ సదువుకోరు. భార్యభర్తలు మీరుగూడ టీవీ పెట్టుకోవద్దు. ఈ నెల పది హేనురోజులు ఎగ్జామ్ అయిపోయేదాకా పిల్లలను జాగ్రత్తగా సూసుకోండి. ఓకే కిషన్ మంచిది..థాంక్యూ.
పేరెంట్ 2..
బాగా సదువుకుంటుందా బిడ్డా..? పొద్దున లేపుతవా ఐదు గంటలకు. లేపితే ముఖం కడుక్కోవెట్టి లైటేసి కూసొనివెట్టి పొలంకాడికి పో. పొద్దుగాల లేస్తే ముఖం మబ్బు మబ్బు ఉంటదిగదా..పొద్దుగాల లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని ముఖం రెండుసార్లు గట్టిగ నీళ్లతోటి కడిగితే..కూసొని మంచిగ సదువుకుంటరు. మరి రాత్రి సదివిపిస్తున్నవా?మీరు భార్యభర్తలు ముచ్చట్లు పెట్టుకుంట లొల్లి పెడితే పిల్లలు కరాబైతరు. మీరుగూడ జర నిశ్శబ్దంగా ఉండాలె. మంచిదమ్మా.. నమస్కారం..
పేరెంట్ 3..
అశోక్.. అభిలాష్ మంచిగ సదువుతుండా? పొద్దున ఐదింటికి లేపుతున్నవా? టీవీలు పెడుతలేరు కదా..? ఫోన్లళ్ల బిగ్గరగా మాట్లాడుడు..పిల్లలకు పొలం పనులు చెప్పుడు బంజెయ్యిన్రి. మంచిగ చదివిపియ్యి జర.. భార్య భర్తలు మీరుగూడ ముచ్చట్లు పెట్టకున్రి. బడిల స్పెషల్ క్లాసులు నడుస్తున్నయా? పెద్దగైనంక బాబు ఏమైతా అంటున్నడు.. డాక్టరా? మన సిద్దిపేటలనే మెడికల్ కాలేజీ ఉన్నది. ఇక్కడనే చదువుకోవచ్చు. మంచిది. థాంక్యూ