హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణ వ్యవహారంపై ఆ పార్టీ నేత రెండుసార్లు పిటిషన్లు దాఖలు చేయడంతో ఆగ్రహానికి గురైన సింగిల్ జడ్జి గతంలో విధించిన రూ.లక్ష జరిమానాను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. సెప్టెంబర్ 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భవనాన్ని క్రమబద్దీకరించాలని ఆ పార్టీ ఆన్లైన్లో గత జూలై 3న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నది. దానిని తిరసరిస్తూ కమిషనర్ జూలై 20న ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణాన్ని 15 రోజుల్లో తొలగించాలని, లేకపోతే కూల్చివేస్తామం టూ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ తరఫున మా జీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి తోసిపుచ్చారు. నల్లగొండ సర్వేనంబర్ 1506 లోని ఎకరం స్థలంలోని నిర్మాణాన్ని క్రమబద్దీకరించేలా కార్పొరేషన్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరించారు.
వాస్తవానికి ఈ వివాదాన్ని మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ విచారణ చేయాలని, ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని, అప్పటివరకు కమిషనర్ ఆదేశాలను రద్దు చేయాలంటూ రవీంద్రకుమార్ రెండోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఒకే వ్యవహారంపై రెండోసారి పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ సింగిల్ జడ్జి పిటిషనర్‌కు లక్ష జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో నల్లగొండ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని తీర్పు వెలువరించారు. దీనిని సవాలు చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ పూర్తి చేసింది. మున్సిపల్ చట్టం-2019 ప్రకారం అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించే అధికారం మున్సిపల్ కార్పొరేషన్‌కు లేదని, పిటిషనర్ కార్యాలయ భవన నిర్మాణాన్ని క్రమబద్దీకరణ కోరేందుకు చట్టంలోనే వెసులుబాటు లేదని తేల్చింది. రూ.లక్ష జరిమానా విధింపు ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు తీర్పులో పేరొన్నది.