యాదాద్రి భువనగిరి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగింతలో కొందరు మిల్లర్లు మాయ చేస్తున్నారు. గడువు ముగుస్తున్నా బియ్యం ముట్టజెప్పకుండానిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రూ.కోట్ల విలువైన బియ్యం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. జిల్లాలో ఇంకా వేల మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో పెట్టి మొండికేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఒత్తిడి తెస్తే మాత్రం ముందు సీజన్ ధాన్యంతో సర్దుబాటు చేస్తున్నారు. టెండర్ ధాన్యం కూడా పత్తాలేకుండా పోయింది. సర్కారు ధాన్యాన్ని ప్రైవేట్‌లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి సీజన్లో ప్రభుత్వమే రైతుల నుంచి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడుతున్నది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తే మిల్లర్లు సీఎంఆర్ చేసి తిరిగి అప్పగించాలి. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం కేటాయించిన మూడు నెలల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు రైస్ మిల్లర్ల తీరుతో ప్రతి సీజన్లోనూ సీఎంఆర్ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. గడువులోగా మెజార్టీ మిల్లర్లు బియ్యం అప్పగించడం లేదు. దీంతో అధికారులు గడువు మీద గడువు పెంచుతూ పోతున్నారు. 2024 యాసంగి సీజన్లో సేకరించిన వడ్లను ప్రభుత్వం మిల్లర్లకు అప్పగించింది. జిల్లాలోని 40 మిల్లులకు 3,69,117 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. తిరిగి సీఎంఆర్ ఇవ్వడంలో మిల్లర్లు తీవ్రం జాప్యం చేస్తున్నారు. ఆ సీజన్లో 2,49,322 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ముట్టజెప్పాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,86,229 మెట్రిక్ టన్నులు మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇంకా 63,093 మెట్రిక్ టన్నులు పెండింగ్‌లో ఉంది. అంటే ఇంకా 26 శాతం సీఎంఆర్ అప్పగించాలి.
ఈలెక్కన సుమారు రూ.140 కోట్ల విలువైన బియ్యం రావల్సి ఉంది. ఇందులో రామన్నపేటలోని విద్య ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్‌లో 6,791 మెట్రిక్ టన్నులు, పోచంపల్లిలోని సోమేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లు 6,732 మెట్రిక్ టన్నులు, ఆలేరులోని మల్లికార్జున ఆగ్రో ఇండస్ట్రిస్ 6,466 ఎంటీలు, వలిగొండలోని న్యూబాలాజీ ఆగ్రో ఇండస్ట్రిస్ 5,117 ఎంటీల సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. ఆ యాసంగితో పాటు మధ్యలో ఓ యాసంగి సీజన్ పూర్తయినా మిల్లర్లు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏడు మిల్లులు మాత్రం 100 శాతం సీఎంఆర్ క్లియర్ చేశాయి. 2025 వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలోని 38 మిల్లులకు 2,62,384 ఎంటీల ధాన్యాన్ని మిల్లులకు కేటాయించారు. ఇందులో భాగంగా 1,76,284 ఎంటీల సీఎంఆర్ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం 5,688 ఎంటీలు మాత్రమే క్లియర్ చేశారు. ఇది 3శాతం మాత్రమే. ఇప్పటి వరకు జిల్లాలో 30 మిల్లులు గింజ బియ్యం కూడా తిరిగి ఇవ్వలేదు.
రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యం పక్కదారి పడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు రూ.కోట్లాది విలువైన వడ్లను అమ్ముకొని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని పెండింగ్‌లో పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో రైస్ మిల్లు నుంచి వందలు, వేల బస్తాల ధాన్యం మాయమవుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి మిల్లర్లు క్వింటాల్‌కు 67 కిలోల బియ్యం చొప్పున తిరిగి ఇవ్వాలి. కొందరు నేరుగా వడ్లనే అమ్మేసుకోగా, మరికొందరు బియ్యంగా మార్చి ప్రైవేట్‌లో అమ్ముకుంటున్నారని తెలుస్తున్నది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చుకొని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడంతో మిల్లర్ల వద్ద సీఎంఆర్ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఎఫ్‌సీఐకి అందజేయాల్సిన ఒక సీజన్‌లోని బియ్యాన్ని వాయిదా వేస్తూ.. మరో సీజన్లో వచ్చే ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఒత్తిడి చేసిన సందర్భంలో కొందరు దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సర్దుబాటు చేస్తున్నారు.
జిల్లాలో సీజన్లు గడుస్తున్నా టెండర్ వడ్లను కొందరు మిల్లర్లు ఇవ్వడం లేదు. 2023-23 యాసంగి సీజన్లో జిల్లాలో 40 మిల్లులకు 4,11,181 ఎంటీల ధాన్యం అప్పగించారు. ఆ తర్వాత సీజన్లు మారుతున్నా సీఎంఆర్ మాత్రమే అప్పగించలేదు. కొందరు అమ్ముకొని డబ్బు వాడుకున్నారు. దీంతో మిల్లుల్లో ఉన్న వడ్లను 2024 జనవరిలో ఈ-టెండర్ ద్వారా విక్రయించారు. 1.86 లక్షల టన్నుల వడ్లను క్వింటాల్‌కు రూ.1,991 చొప్పున టెండర్ ద్వారా కేంద్రీయ బండార్ సంస్థ దక్కించుకుంది. ఇప్పటి వరకు 1,53,958 ఎంటీలు లిఫ్ట్ చేశారు. వడ్లు సరిగా లేకపోవడంతో కేంద్రీయ బండార్‌కు కొందరు మిల్లర్లు డబ్బు చెల్లించారు. ఇంకా 29,297మెట్రిక్ టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో భువనగిరిలోని కాదంబరి మిల్లులో 11,341 ఎంటీలు, ముక్తాపూర్లోని లక్ష్మీనరసింహ ఆగ్రో ఇండస్ట్రిస్ 6,069 ఎంటీలతో పాటు మరికొన్ని మిల్లుల్లోనూ పెండింగ్‌లో ఉన్నాయి.