కరీంనగర్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు 99 రోజుల పాటు నిర్వహించే ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది. ‘వచ్చాం.. సమావేశం నిర్వహించాం.. వెళ్లాం’ అన్నట్టుగా సాగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన ఇన్చార్జి మంత్రి తుమ్మల తన ప్రసంగాన్ని ఐదు నిమిషాలు కూడా కాకుండానే ముగించారు. ముందుగా కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా 99 రోజుల ప్రగతి ప్రణాళికపై నివేదిక ఇచ్చారు. ఈ ప్రగతి ప్రణాళికపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సూచనలు, సలహాలు చెప్పాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల కోరారు.
ఈ విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన వివిధ పథకాల గురించి ప్రస్తావించారే తప్పా, కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనే విషయంపై మంత్రి పొన్నం మినహా ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. సుదీర్ఘ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు వివరిస్తారని, వారికి దిశానిర్దేశం చేస్తారని అందరూ అనుకోగా.. సమావేశం మాత్రం అందుకు భిన్నంగా సాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశ్క్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రజా సమస్యలను ఏకరువు పెట్టినా.. మంత్రులు పట్టింపులేనట్టు వ్యవహరించడం కనిపించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నిర్వహించాలని నిర్ణయించగా, ఇదే రోజు ఇన్చార్జి మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. సన్నాహక సమావేశం అంటే కార్యక్రమం ప్రారంభానికి ముందే నిర్వహిస్తారు గానీ, ఇలా ప్రారంభం రోజే నిర్వహించడం ఏంటనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
ప్రగతి ప్రణాళిక అంటే ఏమిటీ? : కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ, తనకో విషయం అర్థం కావడం లేదని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటే ఏమిటని ప్రశ్నించారు. ప్రగతి వివరించే కార్యక్రమమా.. ప్రణాళికలు చేసే కార్యక్రమమా..? అని తనకు ఉన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిగించుకుని బోత్ అంటూ సమాధానం చెప్పారు. కానీ, ఎమ్మెల్యే సంజయ్‌కి మాత్రం తన అనుమానం నివృత్తి అయినట్టు అనిపించ లేదు. తర్వాత ఆయన తన నియోజకవర్గంలోని సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయని, మిగిలిన కొద్ది పనులను పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, ఈ పనులను చూస్తే గుడి కట్టి దేవున్ని ప్రతిష్టించనట్టుగా ఉందన్నారు. కొత్త ప్రణాళికల మాట అటుంచితే.. నిలిచి పోయిన పనులను 99 రోజుల ప్రణాళికలో భాగంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి మంత్రిని కోరారు.
అభివృద్ధి పనులు కొనసాగించండి : గంగుల
ముందుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పద్నాలుగు నెలల ముందు ఇన్చార్జి మంత్రి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారని, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జిల్లా అధికారులతో సమావేశమయ్యారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు పేరుకు పోయాయని విన్నవించారు. కరీంనగర్లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు ఆగిపోయాయని, వాటిని కొనసాగించాలని కోరారు. నగరంలో 24 గంటల నీటి సరఫరాకు ట్రయల్ జరిగిందని, దీనిని కొనసాగించకపోవడంతో ఇప్పుడు రెండు మూడు రోజులకు ఒక సారి నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. సీఎం అస్యూరెన్స్ స్కీం కింద అప్పటి సీఎం కేసీఆర్ 360 కోట్లు ఇచ్చారని, ఈ నిధులతో చేపట్టిన 125 పనులు ఇంకా పూర్తి కాలేదని, వాటిని కొనసాగిస్తే నగరం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయ పడ్డారు. దక్షిణ భారత దేశానికే తలమానికం అవుతుందనుకున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను కూడా కొనసాగించడం లేదని వాపోయారు.
నత్తనడకన అభివృద్ధి పనులు : కౌశిక్‌రెడ్డి
తన నియోజకవర్గంలో పనులన్నీ నత్తనడకలో నడుస్తున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. 30 కోట్లతో చేపట్టిన వీణవంక రోడ్డు పనులు చాలా నెమ్మదిగా నడుస్తున్నాయని, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. 2023లో కల్వల ప్రాజెక్టు తెగినప్పుడు కేసీఆర్ 17 కోట్లు కేటాయించారని, ఇప్పటికీ పనులు చేపట్టడం లేదనన్నారు. మరో కోటి జోడించి ఇస్తామని చెప్పారని, కానీ, ఈ పనులకు మోక్షం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రాజెక్టు కింద 7 నుంచి 8 వేల ఎకరాలు సాగవుతుందని, ప్రాజెక్టు కడితే మరో వందేళ్లు ఉంటుందని, ఈ విషయం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కూడా తెలుసని, ఇప్పటికైనా పనులు చేపట్టాలని కోరారు. హుజూరాబాద్‌లో మినీ స్టేడియం పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 కోట్లు కేటాయించామని, ఈ పనులు కూడా ముందుకు పాగడం లేదన్నారు. జమ్మికుంట, నాగంపేట రోడ్డులో వంతెన పూర్తిగా శిథిలమై పోయిందని, దీనిని నిర్మించాలని కోరారు.