కరీంనగర్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదగిరిగుట్టకు దీటుగా వేములవాడ రాజన్న ఆలయాన్ని తీర్చిదిద్దుతామంటూ పనులు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఫైల్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణాలు చేపట్టేందుకు ఆరంభించిన పనులు ఆదిలోనే నిలిచిపోయాయి. అందుకోసం తెప్పించిన భారీ యంత్రాలు తిరిగి వెనక్కి వెళ్లాయి. గత ప్రతిపాదనల ప్రకారం పనులు సాధ్యంకాదని గుర్తించిన నిపుణులు, అధికారులు మళ్లీ కొత్త ప్రతిపాదనలు, అంచనాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది. కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో కూడిన ఈ పనులు ఎప్పుడు పూరి ్తచేస్తారో చెప్పలేని అస్పష్టత నెలకొన్నది. వేములవాడ రాజన్న ఆలయ నిర్మాణ పనులు నాలుగు దశల్లో పూర్తిచేయాలని నిర్దేశించిన ప్రభుత్వం.. అందుకు రూ.696.25 కోట్లు అవసరమని తొలుత అంచనా వేసింది.
ఫేజ్-1 కింద రూ.111 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటివరకు రూ.56 కోట్ల విలవైన పనులకు మాత్రమే టెండర్లు పిలిచింది. రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు 2024 నవంబర్ 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సంబంధిత కన్సల్టెన్సీ ప్రాథమిక పనుల నిమిత్తం రూ.10 లక్షలు సర్దుబాటు ప్రాతిపదికన వీటీడీఏ ద్వారా 2025 మార్చి 10న చెల్లించారు. 2025 మార్చి 20న జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ప్రకటించిన అధికారులు పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. కానీ, ఆదరాబాదరగా కూల్చివేతలు ప్రారంభించారు. అక్టోబర్ నుంచి నేటివరకు ఆలయంలో పాత కట్టడాల కూల్చివేతలు జరుగుతున్నాయి తప్ప, నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. ఫైల్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణాలు చేసేందుకు సాయిల్ టెస్ట్ పూర్తిచేశామని చెప్పిన అధికారులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది.
ఆగమేఘాల మీద కూల్చివేతలు
ఏ ప్రభుత్వమైనా పాత కట్టడాలు కూల్చివేసి, కొత్త నిర్మాణం చేపట్టాలని భావించినప్పుడు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసి ముందుకెళ్తుంది. అందులోనూ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ నిర్మాణ పనులు చేపట్టే సమయంలో ఒకటికి నాలుగుసార్లు ఆలోచనలు చేయాలని ముందుగానే నిపుణులు సూచించారు. కానీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, ఆగమేఘాల మీద కూల్చివేత పనులకు ప్రభుత్వం పూనుకున్నది. కళాభవన్, రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయం, ధర్మగుండం, రాజన్న ఆలయ గోదాం, ఉత్తర రాజగోపురం, కల్యాణకట్ట, ఓపెన్ స్లాబ్, లడ్డూ తయారీ భవనం, కోడెల క్యూ కాంప్లెక్స్ తదితర కట్టడాలను ఇప్పటికే కూల్చివేశారు. ఆయా కార్యాలయాలను భీమేశ్వర సదన్‌కు తరలించారు. కానీ, అభివృద్ధి పనులు మాత్రం ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నాయి.
ఏ నిర్మాణ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. అభివృద్ధి పనుల వివరాలు ఎప్పుటికప్పుడు భక్తులకు తెలియజేయాల్సిన స్థానిక అధికారులు విముఖత వ్యక్తంచేస్తున్నారు. లోపల ఏం జరుగుతున్నది? ఎన్ని పనులు ప్రారంభించారు? ఇప్పటివరకు ఎన్ని పనులు పూర్తయ్యాయి? ఎప్పటిలోగా పూర్తి చేస్తారో అనే ప్రశ్నలకు ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. పనులు వేగవంతంగా పూర్తిచేసి, సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు రాజన్న దర్శనం కల్పిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట దాటవేస్తున్నారు. రెండేండ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళాకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీ ఉన్నది. వచ్చే జనవరిలోనే మేడారం జాతర ఉండగా ఇప్పటివరకు అధికారులు దర్శనం విషయంలో ఎటువంటి ప్రకటనలూ చేయడంలేదు.
ఇదిలాఉంటే.. రాజన్న క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగే మహాశివరాత్రి వేడుకలు కూడా ఈసారి భీమేశ్వర ఆలయంలోనే నిర్వహించే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం ఉండగా, అప్పటివరకు ఏ మేరకు పనులవుతాయో.. లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.
మొరాయించిన యంత్రాలు
ఆలయ ప్రాంగణంలో ఒకవైపు చెరువు, మరోవైపు చెరువు కట్టపై దేవాలయం ఉన్నది. ఇక్కడ సిమెంట్ కాంక్రీట్‌తో పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టేందుకు నవంబర్ 17న భారీ యంత్రాలను వేములవాడకు తెప్పించారు. అంతకంటే ముందు నవంబర్ 12న రాజన్న ఆలయాన్ని మూసివేశారు. నిర్మాణ పనులు జరుగుతున్నందున దేవాలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించి, ఫైల్ ఫౌండేషన్ పనులు నవంబర్ 22న ప్రారంభించారు. కానీ, వారం తిరగకుండానే పనులు నిలిచిపోయాయి. ఫైల్ ఫౌండేషన్ పనులు చేయలేమని తేల్చిచెప్పింది. నిజానికి 50 ఏండ్ల కింద దేవాలయ పునర్నిర్మాణం జరిగిన సమయంలో చెరువు కట్టపై భారీ రాళ్లను అమర్చి, తద్వారా నిర్మాణం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ముందుగానే ఈ విషయాన్ని స్థానికులు చెప్పినా అధికారులు కొట్టిపారేశారు. ఫైల్ ఫౌండేషన్ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. కానీ, తీరా పని మొదలుపెట్టగానే యంత్రాలు మొరాయించాయి.
ఫైల్ ఫౌండేషన్ వేసే సమయంలో గతంలో నిర్మాణానికి వినియోగించిన పెద్ద రాళ్లు అడ్డు పడుతుండటంతో యంత్రాలు పనిచేయకుండా పోతున్నాయని చెప్పిన సంబంధిత అధికారులు, నిర్వాహకులు పనులు ఆపివేశారు. సదరు భారీ యంత్రం ద్వారా రోజుకు 10 నుంచి 20 ఫైల్స్ వేయాల్సి ఉండగా, మూడు రోజులకు కేవలం మూడు ఫైల్స్ ఫౌండేషన్ చేయడానికే నానా తంటాలు పడాల్సి వచ్చింది. అవి కూడా మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తున్నది. దీంతో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం.. ఫైల్ ఫౌండేషన్ పనులను పరిశీలించి ఇకపై ఫైల్ ఫౌండేషన్ ద్వారా పనులు చేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను సదరు సాంకేతిక బృందం సమర్పించినట్టు తెలుస్తున్నది. దీంతో ఇప్పుడు మళ్లీ యంత్రాంగం కొత్త ప్రతిపాదనలను సిద్ధంచేసినట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇదే సమయంలో మళ్లీ సాయిల్ పరీక్షలు నిర్వహించి ఎలా ముందుకెళ్లాలో సమాలోచనలు చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అంటే ప్రణాళికాలోపం ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి.