ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ రిజర్వేషన్ల పెంపు ఉద్యమం చేపడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వివిధ బీసీ కులాల సంఘాల నాయకులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో వంటావార్పు, సకల జనుల సమ్మె, సాగరహారం, రహదారుల దిగ్బంధం వంటి కార్యక్రమాలు జరిగాయని, ఇదే తరహాలో బీసీ రిజర్వేషన్లకు ఉద్యమిస్తామని తెలిపారు.
దీని కోసం త్వరలోనే అన్ని బీసీ విద్యార్థి, యువజన, కుల సంఘాలతో కలిసి బీసీ జేఏసీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్, డాక్టర్ బొమ్మ హన్మంతరావు, డాక్టర్ సాంబశివగౌడ్, డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్, డాక్టర్ వీరుయాదవ్, డాక్టర్ ఆర్ఎన్ శంకర్, జగన్ ముదిరాజ్, డాక్టర్ ఏలేందర్యాదవ్, మాసంపల్లి అరుణ్‌కుమార్ ప్రజాపతి, పూసల రమేశ్, రామ్‌గౌడ్, బొమ్మ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.