Telangana | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించినా పట్టించుకోని ఉన్నతాధికారులు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికతో మేల్కొన్నారు. ‘ప్రజల ఆరోగ్య పరిరక్షణను పట్టించుకోని అధికారులను సస్పెండ్ చేస్తామని’ సీఎం చెప్పడంతో హడావుడిగా దవాఖానల్లో పర్యటించి సదుపాయాలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి సమీక్షలు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రారంభంకాగానే ఈ పని చేసి ఉంటే.. పరిస్థితి ఈ స్థాయిలో ఉండేదికాదని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
డెంగ్యూ, చికున్ గున్యా, విష జ్వరాలు ప్రభలుతున్నాయని, దవాఖానల్లో పడకలు, సిబ్బంది, మందులు సరిపోవడంలేదని వైద్యసిబ్బంది ఎంత మొత్తుకున్నా ఇన్నాళ్లూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి సరైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయడంలో విఫలం అయ్యారని వైద్యవర్గాలే పేర్కొంటున్నాయి. విషజ్వరాలు విజృంభణపై మీడియాలో వరుస కథనాలు వచ్చినా ఫలితం కనిపించలేదు. పరిస్థితి అదుపు తప్పడంతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని, పట్టణాలు, గ్రామాల్లో ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
వైద్యాధికారుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టే చర్యలపై ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేస్తాం’ అని హెచ్చరించారు. దీంతో హుటాహుటిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే.. సీజనల్ వ్యాధుల యాక్షన్ ప్లాన్‌కు నేతృత్వం వహించాల్సిన డీపీహెచ్ ఈ సమీక్షలో లేకపోవడం గమనార్హం. మంత్రి ఆదేశాల మేరకు వైద్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం వివిధ దవాఖానలను పరిశీలించాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం డీపీహెచ్ రవీందర్ నాయక్ ఉస్మానియా దవాఖానకు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ గాంధీ దవాఖానకు, డీఎంఈ వాణి కోఠి జిల్లా దవాఖానకు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఫీవర్ హాస్పిటల్‌ను సందర్శించారు. జ్వర కేసుల నమోదుపై ఆరా తీసి, దవాఖానల్లో వసతులు, పరికరాలు, మందుల నిల్వ వంటివి అడిగి తెలుసుకున్నారు. గురువారం హైదరాబాద్ శివారులోని దవాఖానల్లో వారు పర్యటించనున్నారు.
దవాఖానల్లో సరిపడా మందులున్నాయి ;‘నమస్తే తెలంగాణ’ కథనానికి టీజీఎంఎస్ఐడీసీ ఎండీ వివరణ
ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జ్వరాల పరిస్థితి, దవాఖానల్లో మందుల కొరతపై ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ప్రచురితమైన ‘ఇంటికి ఇద్దరికి విషజ్వరం’ కథనానికి టీజీఎంఎస్ఐడీసీ ఎండీ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్లలో(సీఎంఎస్) తగినన్ని ఔషధాలు నిల్వ ఉన్నట్టు తెలిపారు. నిత్యం దవాఖానలకు సరఫరా అవుతున్నట్టు వెల్లడించారు. డీఎంఈ, టీవీవీపీ పరిధిలోని దవాఖానలు కూడా సొంత నిధులతో కొన్ని రకాల ఔషధాలు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. ఔషధాల సరఫరాదారులకు రూ.600 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయనడం కూడా సరికాదని చెప్పారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రూ.213 కోట్ల బిల్లులు చెల్లించినట్టు స్పష్టంచేశారు.