పండని పొలం.. పశువుల పాలు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడు.
పంట ఇట్ల.. బతుకుడెట్ల?
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో చేతికొచ్చే దశలో ఉన్న మిరప పంట నీళ్లు లేక ఎండిపోతుండటంతో రైతు బోరున ఏడ్చాడు. తన పంటను చూపిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పెట్టుబడీ వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాడు.l
సాగునీటి కోసం రైతుల ధర్నా
సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ సిద్దిపేట రూరల్ మండలం అంకంపేట, సీతారాంపల్లి రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద సిద్దిపేట-ముస్తాబాద్ రోడ్డుపై మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ నుంచి అంకంపేట చెరువుకు సాగునీరు అందజేయాలని డిమాండ్ చేశారు.
ట్యాంకర్‌తో తడిపినా చేతికొచ్చేనా?
సాగుకు నీళ్లు అందక కండ్లముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు కంటతడిపెడుతున్నారు. కాల్వల ద్వారా సాగుకు నీరిచ్చి పంటలు కాపాడాలని రైతులు మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు డబ్బులు వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామంలో ట్యాంకర్ ద్వారా పంటలకు నీటిని పారిస్తున్న రైతు.
ఆశలు ఆవిరై.. రైతు దంపతుల ఆవేదన
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని మాచారం రెవెన్యూ పరిధిలోని జడ మంగమ్మ, వీరయ్య దంపతులు వీరు. వరి పొలం ఎండిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. రెండు ఎకరాల వరి పొలానికి రూ.60వేలు అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని, కాళేశ్వరం జలాలు రాక పంట మొత్తం ఎండిపోయిందని బోరున విలపించారు. పంటలు ఎండిపోవడంతో తమ కుటుంబం అప్పుల్లో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. – పెన్‌పహాడ్
కాల్వలోకి దిగి నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మానేరు కెనాల్ పారకం, 19, 20, 20/1 నంబర్ డిస్ట్రిబ్యూటరీల దగ్గర మానేరు కాల్వలో నీళ్లు రావడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. కాల్వలోకి దిగి ఇది పరిస్థితి అని తెలిపారు. కాల్వ ద్వారా నీటిని అందించి పంటలను కాపాడాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే: కొప్పుల
కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే ధర్మపురి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది రిజర్వాయర్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న లింక్కాలువ అర్ధాంతరంగా నిలిచిపోగా సోమవారం ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ మండలాల రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
ప్రభుత్వ తీరుతోనే పంటలు ఎండుతున్నాయి
కేసీఆర్ ప్రభుత్వంలో మండుటెండల్లో సాగునీటి కాలువలు జలాలతో కళకళలాడాయని, నేడు అవే కాలువలు నీళ్లు లేక వెలవెలబోతున్నయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి సమీపంలోని మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీళ్లు వెళ్లే ప్రధాన కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాళేశ్వరం కాలువలు ఎడారిగా మారాయని, శ్రీగిరిపల్లి, అంగడికిష్టాపూర్, గణేశ్‌పల్లి, చేబర్తి, అక్కారం, కొండపాక తదితర గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం..
పారని కాలువే సాక్ష్యంబరాజ్ల నుంచి నీళ్లు రాకపోవడం, కాల్వల మరమతును పట్టించుకోకపోవడంతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల పరిధిలో పాడుబడిపోయిన ఓ కాల్వ
సాగునీళ్లియ్యకుంటే ఉద్యమిస్తాం: పల్లా
పొలాలకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం జనగామ మండలం ఎర్రకుంటతండా, దుబ్బతండా, వడ్లకొండ, గానుగుపహాడ్ గ్రామాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు పంటలు ఎండిపోయిన సందర్భాలు లేవని అన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేక ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించలేకపోతుందని మండిపడ్డారు.
రైతుల ఫోన్.. వెంటనే పొలాల్లోకి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు శివారు ప్రాంతంలో ఎండిన పంటలను సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. ఆకేరు వాగుపై ఉన్న చెక్‌డ్యామ్ ఎండిపోయి సాగునీరు రాక చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోతున్నదని రైతులు ఎర్రబెల్లికి ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకోగా వెంటనే స్పందించారు. గ్రామానికి వెళ్లి రైతుల సమస్య తెలుసుకొని ఎస్సారెస్పీ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి రైతాంగానికి సాగు నీళ్లు వచ్చేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
మండిపడుతున్న మిర్చి
రైతులుఖమ్మంలో మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. మార్కెట్లో దగాపడుతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు విపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. సోమవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నాచౌక్‌లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. నిరుడు ఇదే సమయానికి క్వింటాల్ మిర్చి ధర రూ.23 వేలు ఉంటే ఇప్పుడు కేవలం రూ.12 వేల నుంచి రూ.13 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కాల్వ పనులూ బంద్
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ నుంచి వచ్చే ఎల్ఎం6 కెనాల్ పనులు దాచారం వరకు నిలిపేయడంతో సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, దాచారం, రామోజిపేట, చిక్కుడువానిపల్లి, తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్, నర్సింహులపల్లి, ఎడ్లోనికుంట, బాలమల్లుపల్లి రైతులు సోమవారం పెద్దలింగాపూర్ సబ్‌స్టేషన్ వద్ద రిలేనిరాహారదీక్ష చేపట్టిన దృశ్యం.
మళ్లీ బాయిల వైపు రైతుల చూపునీళ్ల కోసం
కరీంనగర్ జిల్లా రూలర్ మండలంలోని ముద్దంపూర్ గ్రామంలో కెనాల్ కాలువ సరిగ్గా రాకపోవడంతో సరిపోయే నీరు పొలానికి అందడంలేదు. దీంతో ఎండిపోతున్న పొలాన్ని కాపాడుకునేందుకు బాయ్ తవ్విస్తున్న ఓ రైతు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్ల కష్టాలు మొదలయ్యాయని రైతు వాపోయారు.
నీళ్ల కోసం బోరున ఏడుపే
నీళ్లు రాకపాయె. పంట ఎండిపోతుండె. కాపాడుకునేదెట్టా అని ఆలోచించిన సంగారెడ్డి పుల్కల్ మండలం గంగోజిపేట గ్రామ రైతు వరి చెనులో బోరు వేయిస్తున్న దృశ్యం