
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఎరువుల ధర మోతెక్కింది. పంటల సాగులో అధికంగా ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. పదో పాతికో కాదు.. ఏకంగా 50 శాతం వరకు పెరిగాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరితో ఇబ్బందులు పడుతున్న రైతులపై ధరల పెరుగుదల మరింత భారం మోపనున్నది. ఒక్కో రైతుపై పంటకు సగటున రూ.2,000 నుంచి రూ.3,000 వరకు భారం పడుతుందని అంచనా. వానకాలం సీజన్‌కు ముందు సాధారణంగా ఉన్న ధరలు యాసంగి సీజన్ వచ్చేసరికి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల ధరలు పెరగడంతో ఎరువుల ధరలు పెంచినట్టు కంపెనీలు చెప్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువులు తయారీకి అవసరమైన భాస్వరం, పొటాషియం మనదేశంలో లభించదు. ఇతర దేశాల్లో వీటి ధరలు పెరగడంతో ఎరువుల ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీల ప్రతి నిధులు తెలిపారు.

ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధరల పెరుగుదలను నియంత్రించకుండా మోదీ సర్కారు చోద్యం చూస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువుల ధరల నియంత్రణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. కంపెనీలు ఎరువుల ధరలను పెంచటం అనివార్యమైన సందర్భంలో ఆ భారం రైతులపై పడకుండా కేంద్రం సబ్సిడీ పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం మాత్రం సబ్సిడీ పెంచకుండా చేతులెత్తేసిందని విమర్శిస్తున్నారు.