హైదరాబాద్, జులై 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతుల నెత్తిన కాంగ్రెస్ స ర్కార్ మరో పిడుగు వేసింది. ఇప్పటికే యూరియా కోసం అరిగోస పడుతున్న అ న్నదాతలపై ధరల భారాన్ని మోపనున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) యూరియా సహా ఇతర ఎరువుల ఉచిత రవాణాను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో అదనపు భారంతోపాటు యూరియా లభించడం మరింత కష్టతరం కానున్నదని రైతులు అభిప్రాయపడుతున్నారు. నిర్ణీత ధరకు విక్రయించాల్సిన సహకార సంఘాలు సైతం ఇకపై ప్రైవేట్ డీలర్లతో పోటీ పడి అధిక ధరకు విక్రయించే పరిస్థితి ఏర్పడనున్నదని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో యూరియాతోపాటు ఇతర ఎరువుల పంపిణీకి మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఉన్నది. రైతులకు సకాలంలో యూరియా అందడంతోపాటు నిర్ణయించిన ధరకు లభించేలా మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లు, ఏఆర్ఎస్కేలకు ఉచితంగా ఎరువులను సరఫరా చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీసీఎంఎస్‌లు, ఏఆర్ఎస్కేలకు ఉచిత రవాణా సదుపాయాన్ని రద్దు చేసింది. కేవలం పీఏసీఎస్‌లకు మాత్రమే కొనసాగించింది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని కూడా రద్దు చేసింది. ఉచిత ఎరువుల రవాణా కోసం మార్క్‌ఫెడ్ ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని నియమించి, యూరియా అవసరం ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయించేది. తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకార సంఘాల ద్వారా ఎరువులు లభించేవి. ఉచిత ఎరువుల రవాణా కోసం ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ భారాన్ని మోయలేక ఉచిత రవాణాను ఎత్తేసినట్టు పేర్కొన్నారు. దీంతో పీఏసీఎస్ కేంద్రాలు ఎరువుల రవాణా చార్జీలను రైతుల నుంచే వసూలు చేసే అవకాశం ఉన్నది. అంటే ప్రభుత్వం తప్పించుకున్న రూ.150 కోట్ల భారం ఇప్పుడు రైతులపై పడనున్నది.
యూరియా బస్తాను సాధారణంగా రూ. 266కి విక్రయించాలి. ప్రైవేట్ వ్యాపారులు రూ. 300 నుంచి రూ. 350 వరకు విక్రయిస్తున్నారు. రవాణా చార్జీలు అధికంగా ఉండడం, ఇతర ఖర్చులే కారణమని డీలర్లు చెప్తున్నారు. రూ. 266కే విక్రయిస్తే నష్టాలే మిగులుతాయని వాపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ధరల మోత తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉచిత రవా ణా రద్దుతో ఎరువుల విక్రయాల నుంచి పీఏసీఎస్‌లు తప్పుకొనే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టాలను తప్పించుకునేందుకు యూరియా ఇండెంట్ పెట్టడం మానేసే అవకాశం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు లారీలు మాట్లాడుకోవడం, కిరాయితో సంబంధం లేకుండా పీఏసీఎస్‌లకు ఎరువులు వచ్చేవి. కానీ ఇకపై కేంద్రాల నిర్వాహకులే లారీలను కిరాయికి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌కు 22 రేక్ పాయింట్లు ఉన్నాయి. రైళ్ల ద్వారా వచ్చిన ఎరువులను రేక్ పాయింట్ల నుంచి నుంచి గోదాముల్లోకి తరలిస్తారు. అక్కడి నుంచి పీఏసీఎస్ నిర్వాహకులు లారీలను మాట్లాడుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి నిర్వాహకులు లారీలను బుక్ చేయడం, యూరియా ఇండెంట్ పెట్టడం వంటివి మానేసే అవకాశం ఉన్నదని విశ్లేషిస్తున్నారు. లారీల కొరత ఉంటే యజమానులు కిరాయి పెంచుతారని చెప్తున్నా రు. కిరాయి పెరుగడం, లారీలు దొరుకని పరిస్థితుల్లో పీఏసీఎస్‌ల నిర్వాహకులు ఇం డెంట్ పెట్టరని, దీంతో ఆయా కేంద్రాల్లో ఎరువుల లభ్యత తగ్గి, రైతులకు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ నష్టాలు మరీ ఎక్కువైతే ఎరువుల విక్రయాలే బంద్ చేసే ప్రమాదం ఉన్నదన్నారు. ఇదే జరిగితే రైతులు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయించక తప్పదు. కాబట్టి ప్రభు త్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.