బయ్యారం, జూలై 22 : పుస్తెలతాడు తాకట్టు పెట్టి పెట్టుబడి పెడితే నకిలీ విత్తనాలు అంటగట్టి నట్టేట ముంచారని మహిళా కౌలు రైతు కన్నీరు మున్నీరుగా విలపించింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన కౌలు రైతులు నాయిని వెంకన్న- నాగమణి దంపతులు సంత్రాలపోడ్ సమీపంలో ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మక్క పంట వేశారు. పెట్టబడి కోసం నాగమణి పుస్తెలతాడు తాకట్టు పెట్టి గ్రామంలోని మదీన ట్రేడర్స్‌లో పయనీర్ కంపెనీకి చెందిన 14ప్యాకెట్ల మక్క విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు.
పంట వేసి 45 రోజులు గడుస్తున్నా ఎదగక పోవడమే కాకుండా ఒక్కొక్కటిగా కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతు దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. అధిక దిగుబడి వస్తాయని చెప్పి విత్తన షాపు యజమాని తమకు నకిలీ మక్క విత్తనాలు అంటగట్టారని నాగమణి పంట చేనులో విలపించింది. అప్పు తెచ్చి పెట్టబడి పెట్టామని, రూ. లక్షా ఇరవై వేలు కౌలు కట్టామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయారు. తమకు నష్టపరిహారం అందించాలని, లేకుంటే ఇద్దరం పంట చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఏవో రాంజీనాయక్ పంటను పరిశీలించారు. పారావెట్ తెగులు ఆశించడంతో పంట ఎండిపోయిందని సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చని సూచించారు.