హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్సిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2022-23, 2023-24 విద్యాసంవత్సరాలకు సంబంధించి రూ.5,500 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని తెలిపారు. నిరుడి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కోర్సులు పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొన్నదని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం కూడా రెండు నెలల్లో పూర్తికావస్తున్న నేపథ్యంలో వెంటనే ఆయా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.