 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు అడిగినందుకు కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయడమేంటని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలను ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీల పేరుతో భయపెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో విలేకరులతో వారు మాట్లాడుతూ.. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్కు పిలుపునివ్వగా, ప్రభుత్వం ఫీజు బకాయిల నిధులు నిర్వీర్యం అవుతున్నాయని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తుందని విమర్శించారు.
రాష్ట్రంలో రూ.8వేల కోట్లు పెండింగ్ ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బకాయిలు విడుదల చేయలేదని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఒకేసారి ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్మాట తప్పారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్రెడ్డి ప్రతినెలా రూ.500 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఇచ్చిన హామీని విస్మరించారని మండిపడ్డారు. ఇప్పటికైనా పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని, లేకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని మణికంఠరెడ్డి, లక్ష్మణ్ హెచ్చరించారు.
 
                            