చిన్నకోడూర్, ఆగస్టు 18: ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై తండ్రీకొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌కు చెందిన గజేందర్‌రెడ్డి (50) ఈనెల 14న తన కూతురు సంతోషి పెండ్లిని ఘనంగా జరిపించాడు. పెండ్లి పనులు పూర్తి కావడంతో అతడి కొడుకు రాజిరెడ్డి (27)తో కలిసి అతడు సాగుచేస్తున్న ఎకరం మక్కజొన్న పంటను పందుల బెడద నుంచి రక్షించేందుకు విద్యుత్తు వైరును ఏర్పాటు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తండ్రీకొడుకులకు విద్యుత్తు షాక్ తగలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై సైఫ్అలీ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిద్దిపేట జిల్లా దవాఖానకు తరలించి.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్‌షాక్‌తో తండ్రీకొడుకు మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తంచేశారు. రూ.10వేల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ నాయకుల ద్వారా పంపించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.