హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పులు చేయడంలో రికార్డులు బద్దలు కొడుతున్నది. తెలంగాణ చరిత్రలో ఎవరూ చేయనన్ని అప్పులు చేస్తున్నది. బడ్జెట్ ప్రతిపాదనలకు మించి రుణాలు తెచ్చుకుంటున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రుణ సమీకరణ లక్ష్యాన్ని ఇప్పటికే పూర్తిచేసింది. నవంబర్ 18 నాటికే 102 శాతానికి చేరుకున్నది. ఆర్థిక సంవత్సరంలో మిలిగిన నాలుగున్నర నెలల్లో మరో 30-50 శాతం వరకు రుణ సమీకరణ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. అందినకాడల్లా అప్పులు చేస్తున్నది. తెలంగాణ ప్రజల నెత్తిన రుణభారం మోపుతున్నది. బడ్జెట్ అంచనా ప్రకారం.. రాష్ట్ర రాబడులు 40 శాతానికి చేరడం లేదు. కానీ, అప్పులు మాత్రం 102 శాతానికి చేరుకున్నాయి. కొవిడ్ కష్టకాలంలో కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. బడ్జెట్ ప్రతిపాదనల్లో 83 శాతమే రుణ సమీకరణ చేసింది. రేవంత్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన కీలక హామీలు అమలుచేయకుండా, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టకుండానే నియంత్రణ లేకుండా అప్పులు చేయడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రేవంత్ సర్కారు తెలంగాణ ప్రజలపై మోయలేనంత రుణభారం మోపుతున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గడిచిన 12 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో బడ్జెట్లో రుణ ప్రతిపాదన రూ.17,398.72 కోట్లు ఉండగా, నాటి ప్రభుత్వం నవంబర్ నాటికి రూ.1,564.54కోట్లు మాత్రమే సమీకరించింది. 2025-26 బడ్జెట్లో గతంలో ఎన్నడూలేనంతగా రూ.54,009.74 కోట్లు ప్రతిపాదించింది. నవంబర్ 18నాటికే రూ.55,000 సేకరిస్తున్నది. అంటే రుణ సమీకరణ లక్ష్యం 102 శాతానికి పెరిగింది. గడిచిన పదేండ్లలో రెండేండ్లు 2019-20, 2020-21 కొవిడ్ మహమ్మారి విజృంభించి ఆర్థికలావాదేవీలు స్పందించినా, రాష్ట్ర ప్రభుత్వానికి రుపాయి ఆదాయం రాకపోయినా నాడు రుణ సమీకరణ లక్ష్యాన్ని పెంచుకోలేదు. బడ్జెట్ ప్రతిపాదించిన మొత్తంలో గరిష్ఠంగా 83.56 శాతమే నాటి కేసీఆర్ సర్కారు సమీకరించింది.
అప్పులు తీసుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్రెడ్డి సర్కారు సొంత ఆదాయ వనరులను సృష్టించడంలో మాత్రం చతికిల పడుతున్నది. అదే కేసీఆర్ పదేండ్ల పాలనలో కొవిడ్ కాలం మినహాయిస్తే సొంత ఆదాయ వనరులు ఏటికేడు పెరిగాయి తప్ప తగ్గలేదు. కానీ, రేవంత్రెడ్డి అనాలోచిన నిర్ణయాలు, అనుభవ లేమి చర్యలతో సొంత ఆదాయ వనరులు పడిపోయాయి. రాష్ట్ర సొంత ఆదాయ వనరులుగా భావించే.. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులు, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర పన్నుల్లో రాష్ట్రవాటాలు తగ్గుతున్నాయి.
హైడ్రా, ఫ్యూచర్ సిటీ, మెట్రో రద్దు వంటి నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులు, సేల్స్ ట్యాక్సులు వంటివి తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో రెవెన్యూ ఆదాయం 34.10 శాతం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 33.49 శాతమే వచ్చింది. కొవిడ్ కాలం మినహా గడిచిన 11 ఏండ్లలో ఇంత తక్కువ శాతం ఆదాయం రాలేదు. ఒకవైపు రాష్ట్ర ఆదాయం పెరుగకపోవడం, మరోవైపు తెలంగాణపై రుణభారం గతంలో ఎన్నడూలేనంతా వేగంగా పెరిగిపోతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే.. ఇప్పుడున్న సంక్షేమ పథకాల అమలుకు, అభివృద్ధి పనులకు ఆర్థికకష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


