Monsoon | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, మరో 4,5 రోజుల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈనెల 27 నాటికల్లా రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలు ఉన్నట్టు చెప్పిన ఐఎండీ.. ఇప్పుడు అంతకంటే ముందే రానున్నట్టు పేర్కొన్నది. ఇదే జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు ముందుగా రావడం ఇదే మొదటిసారి అవుతుందని వివరించింది. మరోవైపు ఈ ఏడాది సాధారణం కంటే ఎకువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది.
సాధారణంగా ఏటా జూన్ 1నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని, జులై 8నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయని పేర్కొన్నది. మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుందని తెలిపింది. అది అక్టోబర్ 15నాటికి ముగుస్తుందని వివరించింది. గతేడాది మే30న నైరుతి రుతుపవనాలు రాగా, 2023లో జూన్ 2022లో మే 23న దేశంలోని ప్రవేశించాయని వెల్లడించింది.
ఇప్పటికే దేశంలో సాగుభూమిలో 52% వర్షపాతమే ప్రధాన ఆధారమని తెలిపింది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో ఈ నైరుతి రుతుపవనాలు కీలకపాత్ర పోషిస్తాయని వివరించింది. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తికి ముఖ్యమైన జలాశయాలను నింపడానికి ఈ రుతుపవనాలే ఆధారంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశ జీడీపీకి 18.2% తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యమని వాతావరణశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో అకడకడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసినట్టు పేర్కొన్నది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో అత్యధికంగా 5.92 సెం.మీ వర్షం కురిసింది.