తొర్రూరు/ఖానాపురం, ఆగస్టు 20 : యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పీఏసీఎస్, వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట సొసైటీలో చోటుచేసుకున్నది. ఈ నెల 15న తొర్రూరు పీఏసీఎస్‌లో మడిపల్లి, సోమారపుకుంట తండాకు చెందిన రైతులు బానోత్ భోజ్యా, బానోత్ వీరన్న ఆధార్ జిరాక్స్ పత్రాలు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే రైతులు పీఏసీఎస్ ఎదుట బారులుతీరారు. రైతులు ఇచ్చిన ఆధార్ జిరాక్స్ పత్రాలు బాత్రూం వద్ద ఉండడంతో పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌పై మండిపడ్డారు.
బానోత్ భోజ్యా, బానోత్ వీరన్నకు ఒకే బస్తా కేటాయించడంతో అధికారుల కాళ్లు మొక్కగా రెండు యూరియా బస్తాలను ఇచ్చారని వాపోయారు. బుధరావుపేట సొసైటీ ఎరువుల గోదాం వద్ద రైతులు తెల్లవారుజామున 3 గంటల నుంచే బారులు తీరారు. ఓ మహిళా రైతు యూరియా ఇవ్వాలని పోలీసు కాళ్ల మీద పడి వేడుకున్నది. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విట్టర్)లో స్పందించారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దర్జాగా బతికిన రైతన్న కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు మొకే దుస్థితి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.