న్యాల్కల్, సెప్టెంబర్ 6: ప్రాణాలు పోయినా సరే ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆదేశాల మేరకు జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్రెడ్డి శుక్రవారం డప్పూర్లో ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, రైతులతో సమావేశమయ్యారు. భూసేకరణపై వారితో చర్చించారు. బాధిత రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామాల పరిధిలో రెండు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గుట్టుచప్పుడు కాకుండా అధికారులు సర్వే చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భూములను సేకరించేందుకు గ్రామ సభలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించడం సరికాదని అన్నారు.
జీవనాధారమైన పచ్చని భూముల్లో ఏడాదికి రెండు, మూడు పంటలను పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నట్టు చెప్పారు. అలాంటి భూములను ఫార్మాసిటీకి ఇచ్చి.. తాము చావాలా? అని మహిళా రైతులు ప్రశ్నించారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో కాలుష్యం ఏర్పడి తమ ప్రాంతం దెబ్బతినడంతోపాటు ఆరోగ్యాలు పాడయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. భూసేకరణకు ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడితే భయపడేది లేదని హెచ్చరించారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రాతంలో ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వారు డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. బాధిత రైతుల సమస్యలను కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని డీఎస్పీ రామ్మోహన్రెడ్డి తెలిపారు.