Telangana | హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నది రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీరు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి, వరదల్లో కొట్టుకుపోతుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడని మంత్రులు, అధికారులు.. ఇప్పుడేమో హడావుడి చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో కూర్చొని వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండగా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ధాన్యాన్ని రక్షించేందుకు, వేగంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. టార్పాలిన్స్, వేయింగ్ మిషన్లు సమకూర్చాలని ఆదేశాలిస్తున్నారు.
ధాన్యం కొనుగోలు ఊపందుకునే సమ యం నుంచి అకాల వర్షాలు కురుస్తూనే ఉన్నా యి. కొన్నిచోట్ల ధాన్యం మొత్తం తడిసిపోగా, మరికొన్ని చోట్ల కొట్టుకొనిపోయింది. ఒకవైపు వర్ష సూచనలు ఉన్నాయంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే నెల రోజులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి కూడా రైతులపై పగపట్టినట్టు వరుసగా చెడగొట్టు వానలు కురిశాయి. దాంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. మళ్లీ ఆరబెట్టి తీసుకొస్తేనే కొనుగోలు చేస్తామంటూ అధికారులు కొర్రీలు పెట్టారు.
ధాన్యం కొనుగోలులో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. గతం కన్నా ఎక్కువ కొనుగోలు చేశామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు ఏవిధంగా చేస్తున్నారో చెప్పకుండా గతంతో పోల్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటే ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతున్నది. ఈ సీజన్లో 130 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఇప్పటివరకు 50 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. అంటే ఇంకా 80 లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉన్నది.
ధాన్యం కొనుగోళ్లలో సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు చేశామంటూ అధికారులు గొప్పలు చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు సమయంలో అకాల వర్షాల ముప్పును రైతులకు తెలియజేసేందుకు కొత్త విధానాన్ని అమలుచేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడైతే వర్షం కురిసే అవకాశం ఉంటుందో అక్కడ ముందుగానే రైతులను అలర్ట్ చేస్తామని, తద్వారా నష్టం జరగకుండా చూస్తామని ప్రకటించారు.
కానీ, కొద్దిరోజులుగా పరిశీలిస్తే.. అధికారులు చెప్పిన విధంగా వర్షాలపై ముందస్తుగా అలర్ట్ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలు ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ అధికారులు చెప్పింది నిజమైతే.. రైతుల ధాన్యం ఎందుకు తడిసింది? ఇంత నష్టం ఎందుకు జరిగింది? అనేది కీలక ప్రశ్న. మరో విషయం ఏంటంటే.. ఈ సాంకేతికతకు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా దక్కినట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించింది. అంత గొప్ప సాంకేతికత ఉన్నప్పటికీ, ధాన్యాన్ని ఎందుకు కాపాడాలేకపోయారన్నది ప్రశ్న.