కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జలసవ్వడులు చూసిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల నీళ్లొస్తే యాసంగిలో సిరులు పండిస్తామనుకున్న రైతులకు ఇప్పుడు పెట్టుబడులు కూడా మీదపడ్డాయి. కాల్వలు, చెరువుల్లో నీళ్లు లేక.. భూగర్భ జలాలు అడుగంటిపోయి.. ఆగి ఆగి.. చుక్క చుక్క పోస్తున్న బోరుమోటరును చూసి రైతులు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. కండ్లెదుట ఎండుతున్న పంటను కాపాడుకోవడానికి అడ్డగోలు బోర్లు వేసి అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారు. అధికారులు చివరి ఆయకట్టుకు నీళ్లిస్తామని రైతులకు హామీ ఇచ్చి ఆచరణలో విఫలమవుతున్నారు. ఈ విషయంపై ఈ విషయంపై దేవాదుల డీఈ ప్రశాంతిని వివరణ కోరగా, సరిపడా సిబ్బంది లేకపోవడంతో సమస్య వస్తుందని, చివరి గ్రామం వరకు నీరందించేలా చూస్తామని చెప్పారు. అలాగే హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొత్తగట్టుసింగారం నుంచి శాయంపేట వరకు ఉన్న ఎస్సారెస్పీ డీబీఎం 31 కాల్వకు నీళ్లు అందకపోవడంతో వెయ్యి ఎకరాల్లో మక్కజొన్న పంట ఎండిపోతున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్
భూగర్భ జలాలు పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం సంకలమద్ది-నిజాలాపూర్ గ్రామాల శివారులో పారుతున్న పెద్దవాగుపై 2020లో రూ.5 కోట్లతో ఈ చెక్‌డ్యాంను నిర్మించింది.
గతేడాది పొడవునా ఈ చెక్‌డ్యాం మత్తడిపోయడంతో నిజాలాపూర్తో పాటు, మూసాపేట, సంకలమద్ది, మహ్మద్ హూస్సేన్పల్లి శివారులలో ఎక్కడ చూసినా బంగారు పంటలు పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దవాగులో నీటి ప్రవాహం లేక చెక్‌డ్యాం ఇలా ముళ్లకంపలతో బోసిపోయి కనిపిస్తున్నది.
యాసంగి నీటితో ఆరుతడి పంటల్లో భాగంగా మొక్కజొన్న పంట వేసిన ఈ రైతుది సిద్దిపేట. బోర్ల నీటితో మొక్కజొన్న పంట ఏపుగా పెరిగినా సమయానికి భూగర్భజలాలు అడుగంటడంతో తడి అందలేదు. దీంతో మొక్కజొన్న కంకి గింజలు వేయక పశువుల మేతగా మారిపోయింది.
పచ్చగా ఉన్న పంటను కాపాడుకునేందుకు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట గ్రామంలో బోర్ మెషిన్ ద్వారా మరింత లోతుకు పైపులు దించుతున్న రైతులు, పక్కన అదే గ్రామంలో కాలిపోయిన మోటార్లకు మరమ్మతులు చేస్తున్న ఓ మెకానిక్
తుర్కపల్లి మండలం దయ్యంబండతండాకు చెందిన వాంకుతోడు హర్యా 4 ఎకరాల్లో వరి వేశాడు. భూగర్భజలాలు అడుగంటి బోర్ల ద్వారా సాగుకు నీళ్లు అందకపోవడంతో ఎండిన రెండెకరాల్లో ఇలా గొర్రెలు మేపుతున్నారు.
నల్లగొండ మండలం కేశరాజులపల్లి గ్రామంలో నీరందక ఎండిన వరిచేనులో ఆవులను మేపుతున్న రైతు
నల్లగొండ ప్రతినిధి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : కరువు ఛాయలతో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు వేస్తూ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం అక్షరాల లక్ష రూపాయలను వెచ్చించాల్సి వస్తుంది. కొత్తగా 300 అడుగుల లోతు బోరు వేసి, మోటారు బిగించి నీళ్లు పోయించాలంటే కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని బోర్‌వెల్స్ యజమానులు గత జనవరి నుంచి ఫీటు ధరను పది రూపాయలు పెంచారు.
నల్లగొండ జిల్లాలో సగటున ప్రతి రోజు కనీసం 500 బోర్లు కొత్తగా వేస్తున్నట్లు అంచనా. ఒక్కో బోర్వెల్ రోజుకు సగటున 5 నుంచి 6 బోర్లు వేస్తున్నట్లు యజమానులు చెబుతున్నారు. ఎండ తీవ్రత తక్కువగా ఉంటే 8 నుంచి 10 బోర్లు కూడా వేస్తున్నారు. రైతులు చెబుతున్న దాని ప్రకారం ఒక్కో బోరు మోటారుకు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. బోరు వేయాలంటే ఒక్కో ఫీటుకు 70 రూపాయలు చార్జి చేస్తున్నారు. ఇందులోనూ ప్రతి 100 ఫీట్లకు ఒకసారి రేట్లు పెరుగుతాయి. ఇలా ఒక రైతు 300 ఫీట్ల బోరు వేయాలంటే రూ.40 వేలు అవుతుంది. దానికి ఒక మోటారు, పైపులైను, కరెంటు వైరు కలిపి మరో 60వేల రూపాయలు అవుతుంది.
పదేండ్లుగా యాసంగికి నీటి ఇబ్బంది ఎప్పుడూ రాలే. రెండు పంటలు మంచిగ పండించేటోళ్లం. ప్రతి ఏడాది మాదిరిగానే ఏటిలో నీరుంటాయనుకుంటే ఈ ఏడాది నిరాశ మిగిలింది. పాకాల ఏటిలో చుక్క నీరు లేక రాళ్లురప్పలు తేలినయ్. వేల రూపాయల పెట్టుబడి పెట్టి వరి సాగు చేసి నెలకు పైగా కాపాడుకుంటూ వచ్చాం. కానీ నీరు లేక కండ్ల ముందు ఎండిపోతుంటే ప్రాణం తరుక్కుపోతంది.
– బొడా కిషన్, జగ్గుతండా
పాకాల ఏటిలో నీటిని నమ్ముకొని ఆయకట్టు రైతులం యా సంగి సాగు చేస్తాం. ఈ ఏడాది నీటి ఎద్దడి ఉంటుందని భా వించి నీటి అవసరం తక్కువగా ఉండే మినుప పంట వేశా. ఆరు ఎకరాలకు సుమారు లక్ష వరకు పెట్టుబడి అయింది. వేసవి తాపం పెరగటంతో ఏటిలో నీరు పూర్తిగా అడుగంటింది. మినుప పంటకు నీరు సరిపోక ఎండిపోతాంది. నీటి సమస్య కారణంగా ఈ ఏడాది పంట నష్టపోయినట్టే.
– ముత్తినేని భాస్కరావు, బయ్యారం
నాకు ఎకరం 22 గంటలు ఉంది. రూ.2.50 లక్షలతో 520 ఫీట్ల లోతు బోరు వేయించిన. కాళేశ్వరం నీళ్లొచ్చినపుడు బోరు మస్తు పోసింది. దాంతో మరో ఎకరం కౌలుకు తీసుకున్నా. ఇప్పుడు ప్రాజెక్టు నీళ్లు రాక భూ గర్భ జలాలు అడుగంటుపోయినయ్. నాకున్న ఎకరం 20 గుంటలతో పాటు కౌలుకు తీసుకున్న పొలం ఎండిపోతున్నది. కాంగ్రెస్ సర్కారు చెరువులు, కుంటలను నింపి ఆదుకోవాలి.
– సుంకరి మోహన్, రైతు, గుమ్లాపూర్, చొప్పదండి మండలం, కరీంనగర్ జిల్లా
తండాలో నాకు రెండెకరా లున్నది. రెండు బోర్లు వేశాను. వాటి ఆధారంగా వరి పంట సాగు చేశాను. ఇప్పుడు పంట పొట్ట దశకు వచ్చింది. 15 రోజులుగా బోర్లు రోజురోజుకూ తగ్గుతున్నాయి. ఇప్పటికే ఒక ఎకరం పొలం ఎండిపోయింది. పదేండ్లుగా ఎప్పుడూ ఇలా జరుగలేదు.
– వాంకుడోతు మారోణి, దయ్యంబండతండా, తుర్కపల్లి మండలం