వేములవాడ, జూన్ 27: వ్యవసాయమే జీవనాధారంగా భావించిన రైతులకు వాన జాడ కరువైంది. వేసిన పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లికి చెందిన ఉల్లెందుల పోచయ్య తనకున్న నాలుగెకరాల్లో మే చివరి వారంలోనే రూ.25 వేలు వెచ్చించి పత్తి విత్తనాలు నాటాడు. తీవ్ర ఎండలు, పైగా వర్షాలు కురవకపోవడంతో వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. మరోసారి రూ.25 వేలు ఖర్చు చేసి పత్తి విత్తనాలు నాటాడు.
అయినా వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే రూ. 50 వేల వరకు అప్పు చేసి వ్యవసాయం చేస్తుండగా రెండోసారి వేసిన విత్తనాలను దకించుకునేందుకు వాటర్ ట్యాంకర్‌తో నీటిని అందిస్తున్నాడు. ఒకో ట్యాంకర్‌కు రూ. 1,500 వరకు చెల్లిస్తుండగా మొత్తం నాలుగెకరాలకు ఎనిమిది ట్యాంకర్ల మేర నీరు అవసరమవుతున్నది. నీటి కోసమే రూ. 12 వేలు వెచ్చిస్తున్నాడు. చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉన్నది.