ఆదిలాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నో కష్టాలకోర్చి పండించిన పంటలను కొనేటోళ్లు దిక్కులేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న కొర్రీలతోటి అరిగోస పడుతున్నం. తేమ ఎక్కువున్నదని పత్తి కొంటలేరు. కపాస్ కిసాన్ యాప్తోటి ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లే కొంటున్నరు. సోయా అమ్ముదామని పోతే వేలిముద్ర వేయాలంటున్నరు. కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, రుణమాఫీ, పంట నష్టపరిహారం, కొనుగోళ్లు, ఇతర పథకాలతో రంది లేకండ ఉన్నం’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట ఆదిలాబాద్ జిల్లా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులతో కేటీఆర్ మంగళవారం ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు.
మద్దతు ధర లేదు
పత్తికి సీసీఐ ఆధ్వర్యంలో క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర అమలు కావడం లేదు. పత్తి రైతులకు నష్టం కలిగించేలా కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పత్తికి 11 శాతం సుంకం ఎత్తివేసింది. దీంతో సీసీఐ రోజుకో నిబంధన పెడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నది. తేమ పేరిట పత్తి కొనకపోవడంతో ఇండ్లలోనే నిల్వ చేసుకుంటున్నం. రైతుల ఓట్లతో గెలిచిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుల సమస్యలను ఏనాడూ పట్టించుకోవడం లేదు.
– విఠల్, రైతు, బరంపూర్, తలమడుగు మండలం
కపాస్ యాప్‌తో కష్టాలు
కపాస్ యాప్‌లో స్లాట్ బుకింగ్ కాక పంటను అమ్ముకోలేకపోతున్నం. ఈ మధ్య జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన రైతు, ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెరకు చెందిన రైతుల ఇండ్లలో నిల్వ చేసుకున్న పత్తి కాలిపోయింది. తేమ శాతం ఎక్కువ ఉన్నదని సీసీఐ పత్తి కొంటలేదు. రోజుల తరబడి మార్కెట్ యార్డులో రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
-రాజేశ్వర్, రైతు, లక్ష్మీపూర్, జైనథ్ మండలం
ఏమీ చేయలేమనడం సిగ్గుచేటు
కేంద్రంతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇప్పుడు మాటమార్చిండు. రైతుల విషయంలో ఏం చేయలేనని చెప్పడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనాల్సింది పోయి ఏడు క్వింటాళ్లే కొంటున్నది. తేమ ఎక్కువ ఉన్నదని సీసీఐ పత్తి కొంటలేదు. ఈ విషయం మీద ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కనీసం స్పందిస్తలేరు.
– మహేందర్, రైతు, ఆదిలాబాద్ రూరల్ మండలం
రైతులపై ప్రయోగాలా?
సీసీఐకి పత్తి అమ్మాల్నంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్నట! ఆధార్ అనుసంధానంతో పంట అమ్మాలె. తేమ శాతం 8 నుంచి 12 ఉండాలె. ఎకరాకు ఏడు క్వింటాళ్లే కొంటరట! సోయా అమ్మాల్నంటే పట్టాదారు మార్కెట్ యార్డుకు వచ్చి వేలిముద్ర వేయాల్నట! ఇసోంటి నిబంధనల మధ్య రైతులు వ్యవసాయం చేయాలంటే ఎట్ల? కష్టపడి పండించిన పంటలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సింది పోయి ప్రయోగాలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నయ్.
– కాంతారావు, రైతు, ఆదిలాబాద్ రూరల్