(నాగవర్ధన్ రాయల, నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం.. సిద్దిపేట జిల్లాకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తీరొక్క పంట పండించి.. ఎంతోమంది ఆకలి తీర్చిన ఆ ఊరి రైతులు కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగునీళ్లు లేక అరిగోస పడ్డారు. లోవోల్టేజీ కరెంట్, మాటిమాటికీ కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో నీళ్లుపారక బీడుబారిన పొలాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. చేసిన అప్పులు తీర్చేందుకు, కుటుంబాన్ని పోషించుకొనేందుకు భార్యాపిల్లల్ని ఊళ్లో వదిలేసి బొంబాయి, మహారాష్ట్ర, హైదరాబాద్ పోయి ఎక్కడ పని దొరికితే అక్కడ ఉండిపోయారు. దొరికిన పనిచేస్తూ తినీ తినక కుటుంబాలను పోషించుకొన్నారు.
బంగారు పంటలు పండించాల్సిన చేతులతో తాపీ పట్టి సుతారీ పనిచేసి, పొట్టపోసుకొన్నారు. ఊళ్లో ఎకరాల భూమి ఉన్నా నాటి కాంగ్రెస్ సర్కారు పట్టింపులేమితో ఊరుకాని ఊరు.. దేశంకాని దేశం వెళ్లి అష్టకష్టాలుపడ్డారు. తెలంగాణ వచ్చినంక సాగునీళ్లు వచ్చినయ్.. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమాతో సాగు సంబురమైంది. వలసవెళ్లిన రైతులంతా వాపస్ వచ్చారు. ఉన్న ఊళ్లోనే తమ సొంత పొలంలో వ్యవసాయం చేస్తూ దర్జాగా జీవిస్తున్నారు. ఇప్పుడు సిద్దిపేటలో కూరగాయలు కొంటే.. పెద్ద లింగారెడ్డిపల్లిలో కొన్నట్టే! ఆ మార్కెట్లో అమ్మే కూరగాయల్లో సింహభాగం ఆ ఊరి రైతులు పండించినవే!
కాంగ్రెస్ పార్టీ పాలన యాదిజేసుకొంటేనే భయమైతున్నది!
పెద్ద లింగారెడ్డిపల్లిలో రైతులు పొద్దంతా వ్యవసాయం చేసి.. పొద్దుగూకితే చాలు కూడలిలో గచ్చుల మీద కూసోని మంచిగ ముచ్చ ట్లు చెప్పుకుంటున్నరు. వాళ్ల ముచ్చట్లు ఎక్కడ మొదలైనా మధ్యలో వలస బతుకుని యాదిజేసుకొని భయపడిపోతున్నారు. ‘మర్చిపోయే రోజులా.. మామూలు కష్టాలా! తినీ తినక ఎన్ని తిప్పలు పడ్డం. కరెంటు గోసకి ఎంత ఎవుసం జేసి ఏమి లాభం లేకపాయేనని ఊరిడిసి పోయినం’ అని రైతు గోపాల్‌రెడ్డి అంటున్నడు. ‘ఆనాటి బాధలు తల్సుకొంటే.. ఏడుపొస్తది. నీళ్లు లేక ఓ బాధ అయితే.. కరెంటు లేక ఉన్న నీళ్లు వాడుకోలేక ఇంకో బాధ’ అని ఆ ఊరి రైతులంతా ఎనకటి బాధలన్నీ ఏకరువు పెడుతున్నారు. నాడు కాంగ్రెస్ సర్కారు సక్కగ లేక తమ బతుకులు ఆగమైనయని అం టున్నారు. తెలంగాణ రాంగనే సీఎం కేసీఆర్ సంకల్పంతో సాగునీళ్ల గోస తీరిందని, మూడేండ్లలోనే 24 గంటల ఫ్రీ కరెంటు వచ్చిందని చెప్తున్నారు. తమకు రాత్రిపూట కరెంట్‌కోసం బాయికాడ పడుకొనే బాధ పోయిందని, కాంగ్రెస్ పాలనలో పడ్డ కరెంట్ కష్టాలన్నింటినీ సీఎం కేసీఆర్ తీర్చేశారని అంటున్నారు. ‘ఇప్పుడు.. రేపు నీళ్లుంటయో ఉండ వో? కరెంటు వస్తదో? రాదోనని అనుమానమే లేకుండా జేసిండు కేసీఆర్. ఊరు మారింది. బతుకు మారింది. బొంబాయి పోయినోళ్లంతా తిరిగొచ్చిన్రు. తెలంగాణొచ్చి పెద్ద లింగారెడ్డి రైతు బాగపడ్డడు. ఊరు బాగుపడ్డది’ అని సిద్దిపేట రూరల్ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు మోహన్‌రెడ్డి చెప్తున్నారు. ఇది ఒక్క పెద్దలింగారెడ్డిపల్లి కథే కాదు.. ఆ చుట్టుపక్కల పల్లెలన్నింటి కథ! తెలంగాణ పచ్చబడ్డది. రైతు బతుకు బంగారమైంది.
పొట్ట మీద పంట ఎండిపోయె..
పని కోసం మా ఇంట్లనే నలుగురం బొంబాయి పోయినం. 15 ఏండ్లు సుతారి పనిజేశినం. అప్పట్ల రైతుకు కావాల్సినంత కరెంటు ఇచ్చినమని కాంగ్రెసోళ్లు అంటున్న రు. కరెంటు ఎక్కడుంది? 9 గంటల కరెంటు అన్నరు. రెండు మూడు గంటలు వచ్చేది. మల్ల పోయేది. ఆ పాడు కరెంటు కోసం అర్ధరాత్రి బాయికాడికి పోయి పండుకునేది. ఏడాదంత బాయికాడనే. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పొట్టల మీద పంట ఎండిపోయింది. అప్పట్ల ఎకరంల 20 సంచులు పండిస్తే ఇప్పుడు 30 నుంచి 35 క్వింటాళ్లు పక్కా పండుతున్నయ్! ఇప్పుడు కరెంటు తిప్పలు లేవు. ఆటోమేటిక్ కట్క పెడితే అదే నీళ్లు పారిస్తాంది. పొద్దున పోయి నీళ్లు బందు చేసుకొంటున్నం. ఎటూ పోకుండా ఊళ్లనే ఉంటున్న.
– తౌటి యాదయ్య, రైతు
ఇప్పుడైతే పిల్లనే ఇయ్యకపోతుండె
ఇంటర్మీడియెట్ డిస్ కంటిన్యూ చేశిన. వట్టిగ ఎందుకుండాల్నని బోరు మోటర్లు బాగుచేసుడు నేర్చుకున్న. కాంగ్రెస్ పాలనలో రోజుకు నాలుగు నుంచి ఆరు పాడైన మోటర్లు వచ్చేవి. మస్త్ పని. ఇద్దరు ముగ్గురు పనివాళ్లని పెట్టుకొని నడిపిన. అప్పట్ల నా సంపాదన గూడ మస్త్గుండె. నెలకు నలభై, యాభై వేలకు తగ్గకపోతుండె. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కారు కరెంటు ఎక్కువ గంటలు ఇస్తున్నది. మూడు మోటర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నది. అందుకే మోటర్లు కాలిపోవుడనే ముచ్చటనే లేదు. రోజుకి ఒకటీ, రెండు మోటర్లు కూడా రిపేర్‌కు వస్తలేవు. ఈ రోజుల్ల అయితే నాకు ఎవరూ పిల్లనే ఇచ్చేటోళ్లు కాదు.
– బొప్ప రాజలింగం, ఎలక్ట్రీషియన్
రైతులంటే గొర్రెలు కాదు
అప్పట్ల 30 ట్రాన్స్ఫార్మర్లకు 30 కనెక్షన్లు ఉంటుండె. ఇప్పుడు మూడు నాలుగు మోటర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. 25 ఏండ్ల క్రితం మహారాష్ట్రకి వలస పోయినం. నాతోపాటు ఇంకో 15 మంది రైతులు కూడా మహారాష్ట్రకు వచ్చిండ్రు. ఎంత బాధ ఉండె అప్పుడు. తినడానికి తిండి లేదు. చేయనీకి పని లేదు. ఇప్పుడు ఏ సమస్యా లేదు. ఒక్క ట్రాన్స్ఫార్మర్ మీద 15 బావుల కంటే ఎక్కువ ఏడా లేవు. ఒక్క రైతు మూడు డీడీలు తీస్తే 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ కచ్చితంగ ఇస్తాంది. అప్పుడు కరెంట్ పోతదని అందరూ ఒకేసారి మోటర్లు పెట్టుకునేది. ట్రాన్స్ఫార్మర్లు పోయేది. ఇప్పుడు ఎవరికి అసవరం ఉన్నప్పుడు వాళ్లు పెట్టుకుంటున్నరు. ఇప్పుడున్న నీళ్లు, కరెంటు చూస్తే ఇంకో రెండెకరాల భూమి ఉంటె బాగుండు అనిపిస్తున్నది. ఒకప్పుడు మనల్ని గొర్రెల్ని చూసినట్టు చూసిన్రు. అందుకే తెలంగాణ తిరగబడ్డది. తెలంగాణ రాబట్టె మన కరెంటుని మనం వాడకుంటున్నాం. కాబట్టే కోతల్లేవు.
– ఆరుట్ల రాజిరెడ్డి, పెద్ద లింగారెడ్డిపల్లి
కేసీఆర్.. రైతుకు భరోసా
మా పెద్ద లిం గారెడ్డిపల్లి రైతులేకాదు చుట్టుపక్కల ఊళ్లె రైతులందరూ ఇట్లనే తిరిగొచ్చిన్రు. వలస బతుకులన్నీ మళ్లీ బాగుపడ్డయ్. ఆగమైన బతుకులు గాడినపడ్డయ్. నీళ్లు, కరెంటు, రైతు బంధు.. ఈ మూడే మా బతుకుని బంగారం జేశినయ్. వలస బాధలు తప్పి రైతులు భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నరు. ఇంతకంటే ఏం గావాలె? ఇది తెలంగాణ విజయం. కేసీఆర్ నాయకత్వం అంటే రైతుకు భరోసా.
– ఎం మోహన్‌రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు, సిద్దిపేట రూరల్