Urea | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 6 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లేసి నెల 15 రోజులైనా ఇప్పటివరకు యూరియా బస్తాలు అందగా పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా అందక వరి పంట తెరలైతుందని మదన పడుతున్నారు. యూరియా కోసం సింగల్ విండో కార్యాలయం, గోదాములు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట ప్రదక్షణలు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చందంపేటలోని జిల్లా రైతు వేదికలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు.
యూరియా కోసం ఉదయాన్నే సిరిసిల్ల సింగల్ విండో కార్యాలయం చేరుకొని, అక్కడ పేర్లు నమోదు చేసుకొని, మళ్లీ చంద్రంపేటలో జిల్లా రైతు వేదికకు చేరుకుంటున్నారు. జిల్లా రైతు వేదికలో వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో పోలీస్ పహారాలో ఏరియా బస్తాలను అందిస్తున్నారు.440 యూరియా బస్తాలు రాగా,సుమారు 600 మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు.పోలీస్ పహారా లో వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మైకు ద్వారా పిలుస్తూ టోకెన్ రాయించి, వచ్చిన రైతుకు ఒక్క యూరియా బస్తా ఇచ్చి పంపిస్తున్నారు.తర్వాత వచ్చిన రైతులు నిరాశతో వెను తిరుగుతున్నారు. ఒక్క బస్తా యూరియా ఎలా సరిపోతుందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అధికారులు రైతులను గోసపెడుతున్నారు, సరిపడా యూరియా అందివ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. యూరియా అందకపోవడంతో ప్రభుత్వం, అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.