హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లలో న్యాయం జరగడం లేదని బాధితులు ఏకంగా పోలీసు కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారు. పోలీసులు బాధితుల వైపున కాకుండా.. నిందితుల వైపున నిలబడుతున్నారని, తమకు డీజీపీ న్యాయం చేయాలని గోడు వెల్లబోసుకుంటున్నారు. పోలీస్స్టేషన్లలో కానిస్టేబుల్ నుంచి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వరకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డబ్బులు తీసుకుని నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండల పోలీస్‌స్టేషన్ నుంచి, సీఐ కార్యాలయం, డీఎస్పీ ఆఫీసు, ఆఖరికి ఎస్పీ ఆఫీసుల్లో కూడా పట్టించుకోవడం లేదని, ఏకంగా డీజీపీ ద్వారానే న్యాయం జరుగుతుందని.. హైదరాబాద్ వరకూ వస్తున్నారు.
డీజీపీ ఆఫీసు వరకూ వచ్చిన బాధితులకు తాత్కాలిక ఉపశమనం దొరికినా.. కొన్ని కేసుల్లో అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయంలో కొందరు బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల ఓ బాధితురాలు ఓ రియల్ ఎస్టేట్ కుంభకోణంలో డబ్బులు కోల్పోయి.. వాటిని ఇప్పించాలని డీజీపీ కార్యాలయంలోకి ఏకంగా పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టే తీసుకొని రావడం కలకలం సృష్టించింది. డీజీపీతో ఆమె గోడు వెలిబుచ్చినా.. నేటికీ న్యాయం జరగలేదని తెలిసింది.
భూ సమస్యల్లోకి పోలీసులు..
భూ సమస్యల్లో పోలీసులు తలదూర్చి నిందితుల పక్షాన మాట్లాడుతున్నారనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి. నారాయణపేట జిల్లా ఉట్నూరులో ఇటీవల జరిగిన ఓ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గొడవ మొదలైనప్పుడే బాధితులు డయల్ 100కు కాల్ చేయగా.. ఎస్సై, సీఐ పట్టించుకోలేదు. హత్య జరిగిన తర్వాత కానిస్టేబుళ్లను పంపించారు.
మహబూబ్‌నగర్‌లో చెంచు మహిళ ఉదంతం అందరికీ తెలిసిందే.చెంచుల భూమి కొట్టేసేందుకు కౌలు చేస్తున్నవారే దాడి చేయ డం, బాధితురాలి మామను హత్య చేయడం కలవరపెట్టే విషయం. భూమి పంచాయితీల్లో పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడంతో బాధితులు డీజీపీ ఆఫీసు వరకు వస్తున్నారు. భూ సమస్యల్లో పోలీసులు తలదూర్చి న్యాయం చేయడం లేదని మంగళవారం డీజీపీకి కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. ఓ హత్య కేసులో ఇంతవరకూ తమకు న్యాయం జరగలేదని మరో బాధిత కుటుంబం ‘నమస్తే తెలంగాణ’తో వాపోయింది.
కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కయ్యారయ్యా..!
కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మందా విను అనే యువకుడు జనవరి 22న అనుమానాస్పదంగా చనిపోయా డు. పాతకక్షలతో అతని స్నేహితులే మేడారం జాతరకు తీసుకుపోయి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు డబ్బులు తీసుకొని నిందితుల వైపే మాట్లాడుతున్నారని విను తల్లిదండ్రులు డీజీపీ ఆఫీసులో కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుల్లో కొందరికి కాంగ్రెస్ నాయకుల అండ ఉండి తమకు అన్యాయం చేస్తున్నారని భోరున విలపించారు.
ఫోన్ మెమోరీ కార్డులు, డేటా డిలీట్ చేసి, రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని, ఈ కేసును కొట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని, డీజీపీ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అనివార్య కారణాల వల్ల అప్పటి డీజీపీ రవిగుప్తాకు చొప్పదండి నుంచి వచ్చిన బాధితులు కలువలేకపోయారు. డీజీపీ పేషీలో బాధితుల లెటర్‌ను తీసుకొని.. మల్టీజోన్-1 ఐజీకి పంపుతున్నట్టు రిసిప్టు ఇచ్చారు. ఈ కేసులో ఎలా స్పందిస్తారో చూడాలి.