ఆఖరి తడి కోసం ఆందోళన..
జూలపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం సాగునీరు అందించి పంటను బతికించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో శనివారం ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి జూలపల్లి, కుమ్మరికుంట, వడ్కాపూర్, పెద్దాపూర్ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు మూకుమ్మడిగా తహసీల్దార్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి పెద్దపెట్టున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు.
ఎస్సారెస్పీ డీ-83, 86వ ప్రధాన కాల్వల నుంచి వచ్చే సాగునీటిని ఇటీవల నిలిపివేశారని, కోతకొచ్చే దశలో నీటిని ఆపేస్తే ఎలాగని మండిపడ్డారు. తాము ఆలస్యంగా పంట వేశామని మరో వారం పాటు సాగునీరు విడుదల చేయాలని పట్టుబట్టారు. చివరికి పోలీసులు వచ్చి వారిని బలవంతంగా పంపించివేశారు.
వడ్లు పారబోసి నిరసన..
ఆరుగాలం కష్టపడి వరి పండించి నెల కింద కోతలు కోసినా ప్రభుత్వం ఇంకా వడ్లు కొనడం లేదని రైతులు కన్నెర్ర జేశారు. శనివారం వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన వంద మంది కర్షకులు వనపర్తి-పెబ్బేరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా ముండ్ల కంప వేసి.. ధాన్యం పోసి అక్కడే పడుకొని నిరసన తెలిపారు. సెంటర్లకు వడ్లు తెచ్చినా కొనడం లేదని, ఒక్కరోజు మొక్కుబడిగా 140 సంచులు తూకం వేసి నిలిపివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మిల్లర్లు ధాన్యం బాగాలేదని సాకులు చెప్తూ తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని వాపోయారు. 40 కిలోల సంచికి 1300 గ్రాముల తరుగు తీస్తున్నారని, ఇంకా ఎక్కువ తరుగు తీస్తామంటే ఎలా అని మండిపడ్డారు. దాదాపు గంటన్నర సేపు ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా పోలీసులు వచ్చి సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.
– వనపర్తి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ)