నర్సాపూర్,ఫిబ్రవరి 26 : మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చని 14 నెలల కాలంలో జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బుధవారం మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవుసాన్ని నమ్ముకుని కూతురు పెండ్లికి చేసిన అప్పు తీర్చలేక చెట్టుకు ఉరివేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జుతండాలో బుధవారం చోటుచేసుకున్నది.
నర్సాపూర్ ఎస్సై లింగం వివరాల ప్రకారం.. అర్జు తండాకు చెందిన హలావత్ గణేశ్(42) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంట పెట్టుబడితోపాటు రెండేండ్ల క్రితం కూతురి పెండ్లికి అప్పు చేశాడు. ఎవుసంలో సంపాదన మాత్రం అంతంతమాత్రంగానే ఉండడంతో అప్పులు ఎలా తీర్చాలో పోలుపోక బాధపడేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు గాలించగా ్యవసాయ పొలం వద్ద ఓ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. మృతుడి భార్య హలావత్ సాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగం తెలిపారు.