పాలకుర్తి, నవంబర్ 22 : రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మిట్ట మధ్యాహ్నం.. ఎర్రటి ఎండలో యూరియా కోసం రోజంతా బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మూడు నెలలుగా రైతులకు ఎరువుల సమస్య నెలకొన్నది. శనివారం పాలకుర్తిలోని ఆగ్రోస్ కేంద్రం వద్ద సుమారు 500 మంది రైతులు యూరియా కోసం క్యూలో నిల్చున్నారు. వీరిలో మహిళా రైతులు సైతం ఉన్నారు.
ఉదయం నుంచి బారులు తీరినా సకాలంలో పంపిణీ చేయకపోవడంతో ఆర్టీసీ బస్సును ఆపి ఆందోళనకు దిగారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. మరోవైపు ఎక్కువ మంది రావడంతో తోపులాట జరిగింది. అనంతరం సుమారు ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున 400 మందికే యూరియా ఇచ్చారు. మిగిలిన వారికి లభించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని అధికారులను కోరారు.