ఇల్లంతకుంట రూరల్, మార్చి11 : తెలంగాణ పచ్చగా ఉండాలనే లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలువల్లో నీళ్లు పారిస్తే.. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. రంగనాయకసాగర్ ఆర్డీ-3 ఎల్ఎం -6 కెనాల్ నిర్మాణం కోసం ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు చెందిన రైతులు రిలేదీక్ష చేపట్టగా.. బుధవారం రసమయి బాలకిషన్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఇల్లంతకుంట మండలం పెద్దాపూర్ శివారులో కిలోమీటరు కాలువ తవ్వించలేకపోతున్న దద్దమ్మగా మిగిలిపోవద్దని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియోజకవర్గమైన కోదాడకు మధ్యమానేరు, లోయర్‌మానేరు డ్యామ్ నుంచి సాగునీళ్లు వెళ్తున్నాయని, ఇక్కడున్న రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసిఆర్‌ను కలిసి రైతుల కాలువ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించేలా విన్నవిస్తామని చెప్పారు. కెనాల్ కోసం పన్నెండు గ్రామాల రైతులు 30 రోజుల నుంచి రిలే దీక్ష చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్ సహకారంతో ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఎల్ఎం6 కెనాల్‌ను 14 కిలోమీటర్ల మేరకు పూర్తి చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలింగాపూర్ శివారులో కిలోమీటరు కాలువ తవ్వేందుకు 3.20 కోట్ల నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొచ్చి కాలువ పనులు చేయించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుటే టెంట్ వేసి రైతులతో కలిసి దీక్ష చేస్తామని హెచ్చరించారు.