సిద్దిపేట, అక్టోబర్ 22 : రేవంత్ పాలన సగం సగం.. ఆగం ఆగం అన్నట్టు ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఏ ఒక్క పని కూడా సక్రమంగా చేపట్టడం లేదని విమర్శించారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు పండించిన పంట దళారుల పాలైందని ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం సిద్దిపేట మారెట్ యార్డులో వడ్లు, మకల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం మకల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యం చేయడం వల్ల ఇప్పటికే సిద్దిపేట మారెట్ యార్డులో 14 వేల క్వింటాళ్ల మకలు దళారుల చేతికి వెళ్లిందని, ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. మద్దతు ధర కంటే మక్కలను తకువకు రూ. 1,600లకు అమ్ముకున్నట్టు చెప్పారు. ఎకరాకు కేవలం 18 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొంటామనే నిబంధన దుర్మార్గమైందని దుయ్యబట్టారు.
రైతు 25 నుంచి 30 క్వింటాళ్ల మకలు పండిస్తే, 18 క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వం కొంటామంటే, మిగతాది దళారుల పాలవుతుందని పేర్కొన్నారు. పండిన పంట మొత్తం కొంటామని.. కొన్నాక బోనస్ ఇస్తామన్న రేవంత్‌రెడ్డి ఎందుకు కోతలు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రతి గింజకూ మద్దతు ధర ఇచ్చుకుంటామని, ప్రతి పంటకూ బోనస్ ఇస్తామన్న హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. రైతులు మొత్తుకుంటే తప్ప ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదని మండిపడ్డారు. మకల కొనుగోలు మీద పెట్టిన నియంత్రణను ఎత్తివేయాలని, పండించిన మకలను పూర్తిగా కొనాలని డిమాండ్ చేశారు. సగం మంది రైతులకు రుణమాఫీ చేసి మిగతా సగం మందికి ఎగ్గొట్టారని ఆరోపించారు. రైతుబంధు ఇస్తానని రెండు పంటలకు ఇచ్చి రెండు పంటలకు కోత పెట్టిండ్రని, బోనస్ కూడా ఒక పంటకు ఇచ్చి మరో పంటకు ఎగ్గొట్టినట్టు విమర్శించారు. రేవంత్ పాలన సగం సగం.. అంతా ఆగం ఆగ మే అని ఎద్దేవా చేశారు. ప్రభు త్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.