హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : ‘మొంథా తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, మంత్రుల మొద్దు నిద్ర వల్లే అనేక జిల్లాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది’ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారని, మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయని తెలిపారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు నిండా మునిగారని ధ్వజమెత్తారు. యూరియా కొరతతో 50శాతం పంట దిగుబడులు తగ్గాయని, ఈ వర్షాలతో పూడ్చలేని నష్టం మిగిలిందని తెలిపారు. వరంగల్ నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లో భారీగా పంటలకు నష్టం జరిగిందని వివరించారు. ఈ వర్షాల వల్ల 4.47 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారని, వాస్తవంగా 15 లక్షలకు పైగా ఎకరాల్లో అన్ని పంటలకు నష్టం జరిగిందని తెలిపారు. నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే పంటనష్టం వివరాలను తక్కువచేసి చూపుతున్నారని విమర్శించారు. గత వర్షాకాలంలో జరిగిన పంట నష్టానికే బాధిత రైతులకు ఇస్తామన్న పరిహారం సొమ్మును ప్రభుత్వం ఇప్పటి వరకూ చెల్లించలేదని దుయ్యబట్టారు.
తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించిందని విమర్శించారు. ప్రస్తుతం వారంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే దృష్టిపెట్టారని, వరదల్లో నష్టపోయిన రైతులను అసలే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇచ్చే దాకా ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుందని రైతులకు భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఉన్న శ్రద్ధ వరంగల్ జిల్లా సహా వరదబాధిత జిల్లాల ప్రజలపైన ఎందుకు లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బెదిరించి సినీ కార్మికుల కష్టార్జితమైన రూ.72 లక్షల ఖర్చుతో సీఎం సభ పెట్టించారని, ఆ మొత్తాన్ని సినీ కార్మికుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ధ్వజమెత్తారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు లక్ష్మణ్‌రావు, పల్లె రవికుమార్, కే కిశోర్‌గౌడ్, రామచంద్రనాయక్ పాల్గొన్నారు.