వానలు లేవు. సాగునీళ్లు ఇవ్వరు. అయినా సరే.. ఎండుతున్న పంటలను ఏదోరకంగా కాపాడుకుంటున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ కరెంట్ షాక్ ఇస్తున్నది. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యలతో మడి తడువటం లేదు. దీంతో పంటలు ఎండుతున్నాయి. నీళ్లివ్వక, కరెంటూ ఇవ్వకపోతే తాము సాగు ఎలా చేయాలని ప్రశ్నిస్తూ రైతులు రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గురువారం పలు జిల్లాల్లో కరెంటు సమస్యపై రైతులు రోడ్డెక్కారు. సబ్స్టేషన్లను ముట్టడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో కరెంటు కోతలను నిరసిస్తూ రాస్తారోకోకు దిగిన రైతులు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కరెంట్ కోతలు, లోవోల్టేజీ సమస్యతో తమ పంటలు ఎండుతున్నాయంటూ రైతులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో సబ్స్టేషన్లను ముట్టడించారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మద్రి, రాయిపల్లి గ్రామాల రైతులు దిగ్వాల్లోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్‌లోని సబ్ స్టేషన్ ఎదుట సిద్దిపేట-చేగుంట రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో రైతులు సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో దాదాపు 70మంది రైతులు సబ్‌స్టేషన్‌కు వద్దకు వెళ్లి విద్యుత్తు కోతలపై అధికారులను నిలదీశారు. అనంతరం గ్రామంలో సిరిసిల్ల-కోనరావుపేటకు ప్రధాన రహదారిపై నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు బైఠాయించి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.

సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్‌లోని సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ సబ్‌స్టేషన్‌లో ధర్నా చేస్తున్న రైతులు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు