న్యూఢిల్లీ, ఆగస్టు 2: పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో డ్రోన్ ద్వారా సాగుతున్న హెరాయిన్, అక్రమ ఆయుధ సరఫరా కుట్రను బికనీర్ పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో రూ.50 కోట్ల విలువైన 10 కిలోల హెరాయిన్తోపాటు, 11 ఆటోమేటిక్ ఆయుధాలు, 22 మ్యాగజైన్లు, 100కుపైగా తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి సరిహద్దులో బికనీర్ జిల్లా ప్రత్యేక బృందం, సైబర్ సెల్, స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో పాక్ స్మగ్లర్ల కుట్రను ఛేదించారు. డ్రోన్లతో మాదకద్రవ్యాలు, ఆయుధాలను భారత భూభాగంలోకి జారవిడిచినట్టు పోలీసులు చెబుతున్నారు. జారవిడిచిన సరుకులను తీసుకునేందుకు జోధ్పుర్కు చెందిన వీరేంద్రసింగ్ ప్రయత్నిస్తుండగా, అతడ్ని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.