పెనుబల్లి/చింతకాని, సెప్టెంబర్ 20: పంటలకు నీరందక పొట్టదశలో ఉన్న వరితోపాటు పత్తి, మిర్చి ఎండిపోతున్నాయని, వెంటనే ఎన్నెస్పీ జలాలను విడుదల చేసి కాపాడాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సాగర్ కాల్వలు దెబ్బతిన్నాయని, దాదాపు 20 రోజులు దాటినా వాటిని మరమ్మతు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా.. కనీసం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇటీవల సీతారామ ప్రాజెక్టు కాల్వలను ప్రారంభించి హడావిడి చేశారే తప్ప కాల్వల నుంచి నీళ్లు రావడం లేదని, దీంతో కల్లూరు, పెనుబల్లి మండలాల్లోని పంట భూములకు నీరందడం లేదని విమర్శించారు. వెంటనే సాగర్ జలాలు వదలాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ అధికారులకు, ఆర్డీవోకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం, నేరడ గ్రామాల సమీపంలోని సాగర్ ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న వరి, పత్తి, మక్కజొన్న, మిర్చి పంటలను పరిశీలించారు. వెంటనే సాగర్ నీటిని విడుదల చేయాలని తహసీల్దార్ అనంతరాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, రైతులు పాల్గొన్నారు.